సౌర శక్తి వైపు గ్రామాల అడుగులు
పీఎం సూర్యఘర్‌పై ముమ్మర ప్రచారం
ఆకర్షణీయ సబ్సిడీలు.. ఆదాయానికి మార్గం
కాకతీయ, నెక్కొండ: గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ భారం తగ్గించి, పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’పై ప్రచారం వేగవంతమైంది. ఇందులో భాగంగా నెక్కొండ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని రెడ్కో జిల్లా మేనేజర్ గంధం రాజేందర్ పర్యవేక్షించి, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం తమ ఇళ్ల పైకప్పులపై సౌర ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించవచ్చని తెలిపారు. దీనివల్ల కరెంటు బిల్లుల భారం తగ్గడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. సుమారు 25 ఏళ్ల పాటు స్థిరమైన విద్యుత్ లభించడంతో పాటు, అవసరానికి మించి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించి ఆదాయం కూడా పొందవచ్చని వివరించారు.
భారీగా రాయితీలు..
పథకం కింద అందుతున్న సబ్సిడీ వివరాలను ఆయన వెల్లడించారు. ఒక కిలోవాట్‌కు రూ.30 వేలు, రెండు కిలోవాట్లకు రూ.60 వేలు, మూడు కిలోవాట్ల ప్యానెల్స్‌కు రూ.78 వేల వరకు కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తోందని చెప్పారు. సామాన్య కుటుంబాలకు సైతం సౌర విద్యుత్ అందుబాటులోకి రావడమే ఈ పథకం లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఆర్‌ఈడీసీఓ ఫీల్డ్ ఆఫీసర్ నవీన్ కుమార్ యాదవ్, పంచాయతీ కార్యదర్శి సదానందం, గ్రామస్తులు పాల్గొన్నారు.

