ఇందిరమ్మ ఇళ్లకు రాజకీయ రంగులా?
కేంద్ర నిధులతో నిర్మించే ఇళ్లపై కాంగ్రెస్ రంగులేంటి?
బిల్లుల పేరుతో లబ్ధిదారులను భయపెట్టడం సరికాదు
బీజేపీ మండల అధ్యక్షుడు కొంగర రవి విమర్శ
కాకతీయ, గీసుగొండ: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో రాజకీయ రంగులు పులమడం సరికాదని బీజేపీ మండల అధ్యక్షుడు కొంగర రవి విమర్శించారు. మండలంలోని పలు గ్రామాల్లో నిర్మితమవుతున్న ఇళ్లకు కాంగ్రెస్ పార్టీ రంగులు వేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజా ధనంతో నిర్మించే ఇళ్లను రాజకీయ ప్రచార సాధనాలుగా మార్చడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం పేదల గృహ నిర్మాణం కోసం భారీగా నిధులు కేటాయిస్తుంటే.. ఆ నిధులతో నిర్మిస్తున్న ఇళ్లకు కాంగ్రెస్ పార్టీ రంగులు వేస్తేనే బిల్లులు వస్తాయని స్థానిక కార్యకర్తలు లబ్ధిదారులను భయపెడుతున్నారని రవి ఆరోపించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలు చెల్లించే పన్నుల సొమ్ముతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్నాయని, ఇవేమీ రాజకీయ పార్టీల సొంతం కావని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా లబ్ధి చేకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
అధికారులు జోక్యం చేసుకోవాలి..
నిబంధనల్లో లేని రంగుల నిబంధనను లబ్ధిదారులపై ఎలా రుద్దుతున్నారని కొంగర రవి అధికారులను నిలదీశారు. కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నా అధికారులు మౌనంగా ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. రంగులతో సంబంధం లేకుండా నిర్మాణం పూర్తయిన వెంటనే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర నిధులను వాడుకుంటూ రాజకీయ స్వార్థానికి పాల్పడితే సహించబోమని, లబ్ధిదారులపై ఒత్తిడి ఆపకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

