మక్కల తరలింపులో వివక్ష.. రైతుల ఆగ్రహం
పది రోజులుగా సొసైటీ వద్దే నిరీక్షణ
దళారులకే ప్రాధాన్యమంటూ నిరసన
కాకతీయ, నల్లబెల్లి:“పండించిన వాడు ఎండలో ఎండుతున్నాడు.. దళారుల మక్కలు మాత్రం గోదాములు నిండుతున్నాయి” అంటూ నల్లబెల్లి మండల కేంద్రంలోని రైతులు గళమెత్తారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి తీసుకొచ్చిన మొక్కజొన్నలను వెంటనే గోదాములకు తరలించాలని డిమాండ్ చేస్తూ శనివారం నల్లబెల్లి సొసైటీ కార్యాలయం ముందు రైతులు ఆందోళనకు దిగారు. గత పది రోజులుగా పంటను ఇక్కడే కుప్పలుగా పోసి కాపలా కాస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
*నిబంధనలకు పాతర..*
చిన్న, సన్నకారు రైతుల మొక్కజొన్నలు ఎండలో ఎండిపోతూ నాణ్యత కోల్పోతుంటే, మధ్యదళారుల పంట మాత్రం నేరుగా గోదాములకు చేరుతోందని రైతులు ఆరోపించారు. సొసైటీకి పాలకవర్గం లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, బస్తాలు ఇవ్వకుండా.. టోకెన్లు జారీ చేయకుండా వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇదే అదనుగా దళారులు రంగ ప్రవేశం చేసి, తక్కువ ధరకే పంటను అడుగుతున్నారని.. పాస్‌బుక్కులు, ఖాతా వివరాలు వారి చేతుల్లో పెట్టి వారు కట్టించిన రేటుకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు.
*వర్షం వస్తే మా గతేంటి?*
ఆకాశం మేఘావృతమై ఉన్న తరుణంలో వర్షం పడితే తమ పంట తడిసి ముద్దవుతుందని, అప్పుడు తమకు జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని రైతులు ప్రశ్నించారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందన లేదని, అందుకే నిరసనకు దిగాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. తక్షణమే కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటించి, దళారుల జోక్యాన్ని అరికట్టి తమ పంటను తరలించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

