జూన్ 15 నాటికి విద్యా సామగ్రి పంపిణీ పూర్తి కావాలి
విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించడమే లక్ష్యం
నాణ్యత విషయంలో రాజీ పడవద్దు : ఎమ్మెల్యే రాందాస్ నాయక్
కాకతీయ, కారేపల్లి: రాబోయే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యా సామాగ్రి అందాలని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అధికారులను ఆదేశించారు. జూన్ 15వ తేదీలోగా దుస్తులు, నోటు పుస్తకాల పంపిణీని వంద శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థుల చదువుకు ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు పంపిణీ చేసే కిట్లు అత్యున్నత నాణ్యతతో ఉండాలని, ఎక్కడా అలసత్వం వహించకూడదని ఎమ్మెల్యే హెచ్చరించారు. కేంద్రీకృత కొనుగోలు విధానం ద్వారా పారదర్శకంగా, వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. కేవలం అధికారుల నివేదికలపైనే కాకుండా, సామాగ్రి నాణ్యతపై నేరుగా విద్యార్థుల నుంచే అభిప్రాయాలను సేకరించాలని ఆయన వినూత్న నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
తల్లిదండ్రుల హర్షం..
గతంలో సామాగ్రి పంపిణీలో జరిగే జాప్యానికి చెక్ పెడుతూ, ఈసారి ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎమ్మెల్యే తీసుకుంటున్న ఈ చొరవపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కారేపల్లి మండలాన్ని విద్యాపరంగా అభివృద్ధి పథంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వెల్లడించారు.

