రైతులు అధైర్యపడొద్దు..
త్వరలోనే మొక్కజొన్న రవాణా
కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన తహశీల్దార్ సైదులు, ఏవో వాణి
ట్రాక్టర్ల ద్వారా గోదాములకు తరలింపు
కాకతీయ, కూసుమంచి: గత రాత్రి కురిసిన అకాల వర్షాల నేపథ్యంలో మండలంలోని మొక్కజొన్న రైతులకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపడుతున్నట్లు కూసుమంచి తహశీల్దార్ సైదులు, మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి తెలిపారు. సోమవారం వారు మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, వర్షానికి తడిసిన పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కాటా వేసిన మొక్కజొన్న బస్తాలను త్వరితగతిన చేగొమ్మ గోదాముకు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. లారీల కోసం వేచి చూడకుండా, ట్రాక్టర్ల ద్వారా రవాణా చేసేందుకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. ట్రాక్టర్లు అందుబాటులో ఉన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దీనివల్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం అవుతుందని సూచించారు.
గోదాము వద్ద ఏర్పాట్ల తనిఖీ..
అనంతరం వారు చేగొమ్మలోని గోదామును సందర్శించి, దిగుమతికి సంబంధించిన సౌకర్యాలను పరిశీలించారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) జానీ బాబా, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాము మరియు పలువురు రైతులు పాల్గొన్నారు.

