యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం : ఏఎల్వో రాజు
కాకతీయ, మణుగూరు : ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలను ప్రజలు, యువత సద్వినియోగం చేసుకోవాలని మణుగూరు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (ఏఎల్వో) రాజు పిలుపునిచ్చారు. మేడే వారోత్సవాల్లో భాగంగా లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గురువారం మణుగూరు ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో కార్మికులు, విద్యార్థులకు ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎల్వో మాట్లాడుతూ.. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులు, నిర్మాణ రంగంలో పనిచేసే వారి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని వివరించారు. ప్రతి కార్మికుడు ‘ఈ-శ్రమ్’ కార్డు పొందడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించడమే కాకుండా, ఆ కార్డును పొందే విధానాన్ని క్షుణ్ణంగా తెలియజేశారు. వివిధ రంగాల్లో శ్రమిస్తున్న వారి రక్షణ, సామాజిక భద్రత కోసం ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను కార్మికులు అందిపుచ్చుకోవాలని సూచించారు.
విదేశీ ఉపాధిపై ప్రత్యేక దృష్టి
యువతకు మెరుగైన భవిష్యత్తును అందించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఐటీఐ, ఏటీసీలలో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు జర్మనీ వంటి ఇతర దేశాల్లో అద్భుతమైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, ఆ దిశగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కోరారు. అనంతరం వివిధ రంగాల కార్మికులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఇతర వెసులుబాట్లను వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ జి. రవి, ఏటీవో ఎం. శ్రీనివాసరావు, ఏ. నర్సయ్య, ఏటీసీ మాస్టర్ ట్రైనర్ పూర్ణచంద్రరావు, మధు తదితరులు పాల్గొన్నారు.

