ఫార్మా సిటీ భూములను తిరిగిచ్చేయాలి
రైతులకు భూములప్పగించేంత వరకు పోరాటం ఆగదు
ఫార్మాసిటీపై ప్రభుత్వానివి పచ్చి అబద్ధాలు
ప్రజలతో నిజం చెప్పే ధైర్యం రేవంత్ సర్కారుకు లేదు
ఫ్యూచర్ సిటీ పేరుతో బలవంతపు భూసేకరణ
గత ప్రభుత్వ తప్పిదాల్లో భాగమైనందుకు క్షమాపణ కోరుతున్నా
తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత
ఫార్మా బాధితులకు ‘తెలంగాణ రక్షణ సేన’ సంపూర్ణ మద్దతు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఫార్మా సిటీ భూములను రైతులకు వెంటనే తిరిగి ఇచ్చేయాలని, ఫ్యూచర్ సిటీ పేరుతో సాగిస్తున్న బలవంతపు భూసేకరణను సహించేది లేదని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. “ఫార్మా సిటీలో ఏం జరుగుతోంది?” అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొని ఆందోళనకారులకు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం ప్రజలకు కనీసం నిజాలు కూడా చెప్పడం లేదని, అబద్ధాలతో పబ్బం గడుపుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజలతో కనీసం నిజం చెప్పే పరిస్థితిలో లేదని కవిత ధ్వజమెత్తారు. మొన్నటి కేబినెట్ సమావేశంలో రైతులు పండించే పంట కొనుగోలు చేసే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి అన్నారని, ఇది ‘ఇన్ సైడర్ ఇన్ఫర్మేషన్’ అని పేర్కొన్నారు. ముగ్గురు మంత్రులతో వేసిన కమిటీ కేవలం ఈ ఏడాదికి మాత్రమే కొనుగోలు చేయమని సూచించిందని, వచ్చే ఏడాది నుంచి కొనలేమన్న విషయాన్ని దాస్తున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పల మీదనే రైతులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలోనూ ప్రజలు తెలుసుకునే లోపే అన్యాయమైన జీవోలు తెస్తున్నారని విమర్శించారు.
గిరిజనుల భూములపై వివక్ష
ఫార్మా సిటీ కోసం గతంలో 13,500 ఎకరాలన్నా, ఈ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో 30 వేల ఎకరాల అంటోందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. భూసేకరణలోనూ తీవ్ర వివక్ష కొనసాగుతోందని ఆరోపించారు. కురిమెట్లలో 1600 ఎకరాలున్న భూస్వాముల జోలికి వెళ్లకుండా, కేవలం 350 ఎకరాలున్న గిరిజనుల భూములు తీసుకోవడం వారి వైఖరికి నిదర్శనమన్నారు. “డేటా సెంటర్ల వల్ల వచ్చే శబ్ద కాలుష్యం కారణంగా అమెరికాలోనే వాటికి అనుమతి లేదు.. అలాంటి వాటిని ఇక్కడ పెట్టి మనల్ని నాశనం చేస్తారా?” అని ప్రశ్నించారు. కోర్టు స్టే ఉన్నప్పటికీ రావిలలో ప్రైవేట్ కంపెనీలు పనులు ప్రారంభించడం వెనుక గట్టిగా ప్రశ్నించకపోవడమే కారణమన్నారు.
క్షమాపణలు.. భవిష్యత్ కార్యాచరణ
సమావేశంలో కవిత ఒక కీలక ప్రకటన చేస్తూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు, ఉద్యమకారులకు నష్టం జరిగిందని అంగీకరించారు. ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందుకు బహిరంగంగా క్షమాపణలు కోరారు. “మంచి మాటలకు వినే ప్రభుత్వాలు లేవు.. వెలుగుమట్లలో బాధితులకు న్యాయం జరిగే వరకు మేము కూర్చుంటేనే మంత్రులు దిగివచ్చారు.. అలాగే ఇక్కడ కూడా మనం జగమొండిగా పోరాడాలి” అని పిలుపునిచ్చారు. ఫ్యూచర్ సిటీలో బుల్లెట్ ట్రైన్ వస్తుందనేది పెద్ద అబద్ధమని, దీనివల్ల పాత హైదరాబాద్ ప్రాభవం తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు పరిష్కారం లభించే వరకు ‘తెలంగాణ రక్షణ సేన’ ముందుండి పోరాడుతుందని భరోసా ఇచ్చారు.

