కష్టాలను ‘ఢీ’కొట్టి.. ‘డాక్టరు’ పట్టా పట్టి!
డీసీఎం డ్రైవర్ కుమారుడి అద్భుత విజయం
ప్రభుత్వ పాఠశాల నుంచి మెడికల్ కాలేజీ వరకు
తల్లిదండ్రుల కల నిజం చేసిన చైతన్య సాయి
కాకతీయ, ఖమ్మం : పట్టుదలే ప్రాణవాయువుగా.. పేదరికమే మెట్టుగా ఆ యువకుడు తన లక్ష్యాన్ని ముద్దాడాడు. తండ్రి డీసీఎం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటే.. ఆ కష్టాన్ని కళ్లారా చూసిన కుమారుడు చదువునే ఆయుధంగా మలుచుకున్నాడు. పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపిస్తూ ఖమ్మం బిడ్డ నామవరపు చైతన్య సాయి డాక్టర్‌గా పట్టా అందుకుని అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
ఖమ్మం నగరంలోని జహీర్‌పుర, గుట్టల బజార్ ప్రాంతానికి చెందిన నామవరపు కోటయ్య, రేణుక దంపతుల కుమారుడు చైతన్య సాయి. తండ్రి కోటయ్య డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కుమారుడిని చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించారు. చదువే భవిష్యత్తును మారుస్తుందని నమ్మిన ఆ తల్లిదండ్రులు ఎన్ని కష్టాలెదురైనా చైతన్య సాయి విద్యకు ఆటంకం కలగకుండా చూశారు.
లక్ష్యం వైపు అడుగులు
చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉండే చైతన్య సాయి, క్రమశిక్షణతో చదువుకుంటూ ప్రతి తరగతిలోనూ ప్రతిభ చాటాడు. కన్నవారి కష్టాన్ని తీర్చాలనే తపనతో మెడికల్ సీటు సాధించాడు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిధిలోని మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. బుధవారం సాయంత్రం జరిగిన వేడుకలో డాక్టరేట్ పట్టా అందుకున్నాడు.
ఎన్నో త్యాగాలు చేసి చదివించిన తమ కుమారుడు డాక్టర్‌గా పట్టా అందుకోవడం చూసి ఆ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. చైతన్య సాయి సాధించిన విజయంపై గుట్టల బజార్ ప్రాంతంలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. స్థానికులు, బంధువులు పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు. పేదరికం చదువుకు అడ్డంకి కాదని, దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమని చైతన్య సాయి నిరూపించాడని పలువురు కొనియాడారు. అభినందన కార్యక్రమంలో నామవరపు సైదమ్మ, కొత్తపల్లి వీరమణి, కుక్కల వసంత, కొత్తపల్లి ప్రసాద్, మేఘన, సంధ్య, హనీ తదితరులు పాల్గొని నూతన డాక్టర్‌ను ఘనంగా సన్మానించారు.

