తలసేమియా చిన్నారులకు ‘ఎర్రని’ భరోసా
ఖమ్మంలో ‘లైట్ అప్ రెడ్’కు విశేష స్పందన
చిన్నారుల కోసం రక్తదానం చేసిన తుమ్మల యుగంధర్
కాకతీయ, ఖమ్మం : తలసేమియా వ్యాధితో పోరాడుతున్న చిన్నారులకు అండగా నిలిచేందుకు ఖమ్మం నగరం ఒక్కటై గొంతు కలిపింది. ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా టీఎస్ సీఎస్ జిల్లా కోఆర్డినేటర్, ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ఇచ్చిన పిలుపుతో నగరం ఎరుపు రంగు విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది. ‘లైట్ అప్ రెడ్’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయం, ప్రభుత్వ మెడికల్ కళాశాల, జిల్లా ప్రధాన ఆసుపత్రి, డాక్టర్ కూరపాటి చిల్డ్రన్ హాస్పిటల్ భవనాలు ఎరుపు వెలుగులు విరజిమ్ముతూ చిన్నారులకు భరోసానిచ్చాయి.

రక్తదానంతో స్ఫూర్తి
తలసేమియా సొసైటీలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు తుమ్మల యుగంధర్ ముఖ్యఅతిథిగా పాల్గొని చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో తుమ్మల యుగంధర్, డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ స్వయంగా రక్తదానం చేసి స్ఫూర్తిగా నిలిచారు. వీరితో పాటు ‘యువం ఫౌండేషన్’కు చెందిన సుమారు 50 మంది యువకులు రక్తదానం చేశారు. చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ‘ఖమ్మం టెడ్డి టీం’ ఆటపాటలు అలరించాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ.. గత 13 ఏళ్లుగా డాక్టర్ ప్రదీప్ కుమార్ తలసేమియా బాధితుల కోసం చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఉచిత వైద్యం, రక్తదాన శిబిరాల ద్వారా వారికి ఆత్మబంధువుగా నిలిచారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా హెచ్‌బీ ఏ2 పరీక్షలు నిర్వహించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఖమ్మం ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రెహనా బేగం, సెక్రటరీ డాక్టర్ కోటేశ్వరరావు, ట్రెజరర్ డాక్టర్ కూరపాటి ప్రీతి మాట్లాడుతూ బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సనాఉల్లా, డాక్టర్ సిద్ధార్థ్, టీఎస్ సీఎస్ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

