దేవాలయాలకు రాజకీయ రంగు పులమొద్దు
దేవుడిపై రాజకీయాలు చేస్తే పుట్టగతులు ఉండవు
బీఆర్‌ఎస్ నాయకురాలు గండ్ర జ్యోతిరెడ్డి ధ్వజం
కాకతీయ, భూపాలపల్లి : దేవాలయాలను రాజకీయ వేదికలుగా మార్చవద్దని, దేవుడి విషయంలో రాజకీయం చేసే వారికి పుట్టగతులు ఉండవని బీఆర్‌ఎస్ నాయకురాలు గండ్ర జ్యోతిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం భూపాలపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మంజూర్ నగర్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ విషయంలో కాంగ్రెస్ నాయకులు అనుసరిస్తున్న తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంజూర్ నగర్‌లో వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రజల సహకారంతో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్మించామని జ్యోతిరెడ్డి తెలిపారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు తాను 23 నెలల పాటు ఆహారం కూడా ముట్టుకోకుండా దీక్ష వహించానని గుర్తుచేశారు. భక్తులు ఇచ్చిన విరాళాల్లో ఒక్క రూపాయి కూడా తాము ముట్టుకోలేదని స్పష్టం చేశారు. తాము అధికారంలో లేని సమయంలో ఆలయంపై అకారణంగా రాజకీయాలు మొదలుపెట్టారని, నిబంధనలకు విరుద్ధంగా నూతన కమిటీని ఏర్పాటు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుడు అనిల్‌ను తామే శాశ్వత ధర్మకర్తగా నియమించామని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.
అరెస్టులపై ఆగ్రహం
అనైతికంగా సాగుతున్న కమిటీ మార్పుపై నిరసన తెలిపేందుకు ఆలయానికి వెళ్తే, మహిళా నాయకురాలని కూడా చూడకుండా పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడం బాధాకరమని జ్యోతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భూపాలపల్లిలోని ఈ ఆలయాన్ని మరో తిరుపతిలా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న తరుణంలో ఇలాంటి కుట్రలు చేయడం తగదన్నారు. ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని, ఆలయ పవిత్రతను కాపాడాలని ఆమె హితవు పలికారు.

