మనవడిని కాపాడబోయి.. బోరుబావిలో ఇరుక్కుని తాత మృతి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివారులో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పొలం వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరు గుంతలో పడిపోయిన నాలుగేళ్ల మనవడిని కాపాడేందుకు వెళ్లి, అదే గుంతలో ఇరుక్కుపోయి తాత మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం ఊట్లపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ వెంకన్న తన మనవడితో కలిసి పొలానికి వెళ్లారు. ఈ క్రమంలో బాలుడు అక్కడ తెరిచి ఉన్న బోరు గుంతలో పడిపోయాడు. గమనించిన తాత వెంకన్న మనవడిని రక్షించేందుకు స్వయంగా లోనికి దిగారు. అయితే బాలుడిని పట్టుకునే ప్రయత్నంలో ఆయనా లోపలికి జారి, అదే గుంతలో గట్టిగా ఇరుక్కుపోయారు.
నల్గొండ జిల్లాలో బోరు గుంతలో పడిపోయిన నాలుగేళ్ల బాలుడు
బాలుడిని కాపాడేందుకు వెళ్లి అదే బోరు గుంతలో ఇరుక్కుపోయి తాత మృతి
మిర్యాలగూడ మండలం, ఊట్లపల్లి శివారులో వ్యవసాయ పొలం వద్ద ప్రమాదవశాత్తు బోరు గుంతలో పడిపోయిన నాలుగేళ్ల బాలుడు
బాలుడిని కాపాడేందుకు వెళ్లి అదే బోరు గుంతలో… pic.twitter.com/kCTyODr2PL
— Telugu Scribe (@TeluguScribe) May 16, 2026
రక్షించినా దక్కని ప్రాణం
స్థానికులు ఇచ్చిన సమాచారంతో మిర్యాలగూడ రూరల్ పోలీసులు తక్షణమే ఘటనాస్థలానికి చేరుకున్నారు. జెసిబి సాయంతో యుద్ధప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి, బోరు గుంతలోంచి తాత, మనవడిని సురక్షితంగా బయటకు తీశారు. అయితే లోపల ఊపిరి ఆడక 53 ఏళ్ల వెంకన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. బాలుడు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. మనవడిని కాపాడే ప్రయత్నంలో ఉప సర్పంచ్ మృతి చెందడంతో ఊట్లపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

