నాచినపల్లి బడిలో పూర్వ విద్యార్థుల సందడి
17 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి చేరిన 2008-09 పదో తరగతి బ్యాచ్
జ్ఞాపకాలను నెమరువేసుకున్న పూర్వ విద్యార్థులు.. గురువులకు ఘన సన్మానం
విద్యార్థులకు ప్రత్యేక జ్ఞాపికలు అందజేసిన డీకేపీ ఎడ్యూ సర్వీస్ ప్రతినిధి
కాకతీయ, దుగ్గొండి : వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆదివారం స్మృతుల పందిరిగా మారింది. ఈ పాఠశాలలో 2008-09 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా, ఉల్లాసభరితంగా సాగింది. దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత పూర్వ విద్యార్థులంతా ఒక్కచోటకు చేరుకున్నారు. ఒకే వేదికపై కలుసుకోవడంతో పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని, పాత రోజులను గుర్తు చేసుకుంటూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
భావోద్వేగాలు.. తీపి జ్ఞాపకాలు
సమ్మేళనంలో భాగంగా విద్యార్థి దశలో తాము చేసిన అల్లరి, ఆట పాటలు, ఉపాధ్యాయుల వద్ద నేర్చుకున్న క్రమశిక్షణ, పరీక్షల నాటి భయాలు మరియు అనుభవాలను పంచుకుంటూ విద్యార్థులు కాసేపు భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం తాము వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉన్నత స్థానాల్లో స్థిరపడటానికి ఈ ప్రభుత్వ పాఠశాలే బలమైన పునాది వేసిందని వారు కృతజ్ఞతాభావంతో స్మరించుకున్నారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పి, జీవితంలో మార్గదర్శకులుగా నిలిచిన నాటి గురువులను పూర్వ విద్యార్థులు శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించి వారి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు.
విలువలతో కూడిన జీవితం సాగించాలి
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ఎదిగిన ఒదిగి ఉండాలనే సూత్రాన్ని పాటిస్తూ జీవితంలో ఎంతటి ఉన్నత స్థానాలకు చేరుకున్నా నైతిక విలువలను మరువవద్దని హితవు పలికారు. సమాజ శ్రేయస్సు కోరి, సేవా దృక్పథంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ మధుర ఘట్టంలో నాటి ఉపాధ్యాయులు రాజశేఖర్, దూలం రాజేందర్, సోమదాసు, సత్యనారాయణ, కృష్ణమూర్తి, అరుణ, ప్రమోదిని తదితరులు పాల్గొని విద్యార్థులను ఆశీర్వదించారు. కార్యక్రమానికి హాజరైన సుమారు 90 మంది పూర్వ విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు డీకేపీ ఎడ్యూ సర్వీస్ తరఫున కే.శివకుమార్ ప్రత్యేక బహుమతులు, జ్ఞాపికలను అందజేశారు. ఈ వేడుక విజయవంతం కావడానికి పూర్వ విద్యార్థులు బి.రాజు, కె.వినోద్, జి.రవీందర్, కె.అరుణ్, కన్నెబోయిన కవిత, సౌజన్య తదితరులు ప్రత్యేక చొరవ తీసుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు.

