ఎంసెట్ ఫలితాల్లో అనంతరం గ్రామ విద్యార్థుల ప్రతిభ
గాయత్రి, జితేందర్ కుమార్‌లకు ఉత్తమ ర్యాంకులు
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు విద్యార్థుల ఘనత
కాకతీయ , జూలూరుపాడు: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన టీజీ ఎంసెట్ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అనంతరం గ్రామ పంచాయతీకి చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. గ్రామానికి చెందిన ఉసికల దయాకర్ కుమార్తె ఉసికల గాయత్రి స్టేట్ లెవల్‌లో 167వ ర్యాంక్ సాధించి తన సత్తా చాటింది. అదేవిధంగా దయాకర్ కుమారుడు ఉసికల జితేందర్ కుమార్ కూడా 889వ ర్యాంక్ సాధించి గ్రామానికి మంచి పేరు తెచ్చారు.
ఆణిముత్యాలపై ప్రశంసల జల్లు
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్ష అయిన ఎంసెట్‌లో మూడు అంకెల లోపే ఉత్తమ ర్యాంకులు సాధించడంతో అనంతరం గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రముఖ ఆర్ఎంపీ వైద్యులు ఉసికల నరసింహారావు సోదరుడైన దయాకర్ పిల్లలు ఇద్దరూ అత్యుత్తమ ప్రతిభ కనబరచడంపై స్థానికులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉంటూ, కష్టపడి చదివి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన గాయత్రి, జితేందర్ కుమార్‌లను గ్రామ ఆణిముత్యాలుగా అభివర్ణిస్తూ పలువురు ప్రముఖులు, గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు.

