మాదిగల సమగ్ర అభివృద్ధే ఎమ్మార్పీఎస్ లక్ష్యం
ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలి
25 నుంచి జూలై 25 వరకు ‘గో టు విలేజ్’ కార్యక్రమ నిర్వహణ
ఎమ్మార్పీఎస్ జాతీయ మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొడ్డు దయాకర్ మాదిగ
మాదిగ పల్లెల్లో యువత చైతన్యానికి, గ్రామ కమిటీల బలోపేతానికి పిలుపు
కాకతీయ, ఆత్మకూరు: మాదిగ ఉప కులాల సమగ్ర సామాజిక, రాజకీయ, విద్యా అభివృద్ధే ఎమ్మార్పీఎస్ ప్రధాన లక్ష్యమని ఆ సంస్థ జాతీయ మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొడ్డు దయాకర్ మాదిగ స్పష్టం చేశారు. ఆదివారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గద్దల సుకుమార్ మాదిగ అధ్యక్షతన ‘గో టు విలేజ్’ (గ్రామాల్లోకి ఎమ్మార్పీఎస్) సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బొడ్డు దయాకర్ మాదిగ మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ అధినేత, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు విద్యా చైతన్యం, సంస్థగత నిర్మాణం మరియు గ్రామాల్లో జెండా ఆవిష్కరణల కోసం మాదిగ పల్లెల్లోకి ప్రతి ఒక్కరూ కదలాలన్నారు. ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ మరియు అన్ని అనుబంధ సంఘాల నాయకులు ప్రతి గ్రామానికి వెళ్లి అక్కడి మాదిగ యువతను చైతన్య పరిచే విధంగా కృతి చేయాలని పిలుపునిచ్చారు.
30 ఏళ్ల పోరాట ఫలం.. ఎస్సీ వర్గీకరణ
మందకృష్ణ మాదిగ అలుపెరగని నాయకత్వంలో దాదాపు 30 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసి చారిత్రాత్మక ఎస్సీ వర్గీకరణను సాధించుకున్నామని బొడ్డు దయాకర్ గుర్తుచేశారు. ఈ విజయ ఉత్సాహంతోనే మే 25 నుండి మొదలుకొని జూలై 25 వరకు రెండు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా సాగే ‘గో టు విలేజ్’ కార్యక్రమాన్ని ప్రతీ నియోజకవర్గంలో విజయవంతం చేయాలని నాయకులకు సూచించారు. ఇందులో భాగంగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల గ్రామ కమిటీలను పకడ్బందీగా పునర్నిర్మించాలని, ఎక్కడైతే గ్రామాలలో ఎమ్మార్పీఎస్ గద్దెల నిర్మాణం జరగలేదో అక్కడ నూతనంగా గద్దెలను నిర్మించాలని ఆదేశించారు.
గ్రామగ్రామాన జెండా పండుగ
మాదిగ జాతికి అత్యంత పండుగ దినోత్సవమైన ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం జూలై 7వ తేదీతో 32వ వసంతంలోకి అడుగుపెడుతున్నట్లు దయాకర్ తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి గ్రామ గ్రామాన ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణలు జరిపించి, ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గంగారపు శ్రీనివాస్ మాదిగ, ఎమ్మెస్పి జిల్లా అధికార ప్రతినిధి బొక్కల నారాయణ మాదిగ, ఎంఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శాంతి సాగర్ మాదిగ, ఎమ్మార్పిస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కెనకుంట వెంకటస్వామి మాదిగ, జిల్లా సీనియర్ నాయకులు సింగరపు స్వామి మాదిగ, మంద సుభాష్ మాదిగ, జిల్లా కార్యదర్శులు మంద స్వరాజ్ మాదిగ, శనిగరపు రవీందర్ మాదిగ, రజిని కుమార్ మాదిగ మరియు సీనియర్ నాయకులు జేరిపోతుల సారంగపాణి మాదిగ తదితరులు పాల్గొన్నారు.

