మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు
600 మంది మహిళలకు రూ.72 లక్షల విలువైన కుట్టు మిషన్లు
60 మంది కాశ ముస్లిం లబ్ధిదారులకు రాతి కటింగ్ యంత్రాలు
మైనారిటీల సంక్షేమానికి పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రత్యేక ప్రాధాన్యం
రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు
కాకతీయ, పెద్దపల్లి : మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. పెద్దపల్లి పట్టణంలోని ఎంబీ గార్డెన్స్‌లో మంగళవారం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ముస్లిం మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు, కాశ ముస్లిం లబ్ధిదారులకు రాతి కటింగ్ యంత్రాలను టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ మహమ్మద్ ఒబైదుల్లా కోత్వాల్తో కలిసి ప్రభుత్వ విప్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయరమణరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పెద్దపల్లి జిల్లాలో కేవలం 200 కుట్టు మిషన్లు మాత్రమే పంపిణీ చేశారని, పెద్దపల్లి పట్టణంలో 70 మిషన్లు మాత్రమే అందించారని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఒక్కరోజులోనే 600 మంది మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తోందని పేర్కొన్నారు.
రూ.36 లక్షల సబ్సిడీతో రాతి కటింగ్ యంత్రాలు
పెద్దపల్లి జిల్లాలో కాశ ముస్లిం వర్గాలకు చెందిన 60 మంది లబ్ధిదారులను గుర్తించి ఒక్కొక్కరికి రూ.60 వేల సబ్సిడీతో రాతి కటింగ్ యంత్రాలను పంపిణీ చేసినట్లు విజయరమణరావు తెలిపారు. వీటి మొత్తం సబ్సిడీ విలువ రూ.36 లక్షలు అని వివరించారు. అదేవిధంగా 600 మంది మైనారిటీ కుటుంబాలకు ఒక్కొక్కటి రూ.12 వేల విలువైన కుట్టు మిషన్లను అందిస్తున్నామని, వీటి మొత్తం విలువ రూ.72 లక్షలు అని తెలిపారు. వీటి ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. మైనారిటీల సంక్షేమానికి పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. రాఘవాపూర్‌లో మైనారిటీల శ్మశానవాటిక కోసం రెండు ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు ప్రహరీ నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. పెద్దపల్లి పట్టణంలో మైనారిటీల శ్మశానవాటిక కోసం 8 గుంటల స్థలాన్ని కేటాయించామని, షాదీఖానా నిర్మాణానికి కూడా స్థలం కేటాయించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మైనారిటీ కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజయరమణరావు సూచించారు. కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి, స్థానిక కౌన్సిలర్, మత పెద్దలు, పెద్దపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, మహిళలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

