బండి రాజీనామాకు బీఆర్‌ఎస్ డిమాండ్
తెలంగాణ చౌక్‌లో నిరసన.. తోపులాటతో ఉద్రిక్తత
కాకతీయ, కరీంనగర్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ శ్రేణులు సోమవారం ఆందోళనకు దిగాయి. నగరంలోని ప్రధాన కూడలి అయిన తెలంగాణ చౌక్ వద్ద బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులు చేతబూని నిరసన చేపట్టారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలని, బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళన ఉధృతంగా సాగుతున్న సమయంలో బీఆర్‌ఎస్ నేతలు ఫ్లెక్సీని దహనం చేసేందుకు ప్రయత్నించారు. అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు నిరసనకారులను అడ్డుకుని, వారి చేతుల్లోని ఫ్లెక్సీని బలవంతంగా లాక్కోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. దీంతో తెలంగాణ చౌక్ పరిసర ప్రాంతాల్లో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మంత్రి పదవి నుంచి తొలగించాలి
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిలో కొనసాగుతున్నంత కాలం బాధితురాలైన మైనర్ బాలికకు న్యాయం జరగదని ఆరోపించారు. అధికార అండతో కేసును పక్కదారి పట్టించే అవకాశం ఉందన్నారు. ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించి ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించడంతో పరిస్థితి సర్దుమణిగింది.

