కోర్టు ఆదేశాలున్నా భూమిలో అక్రమ నిర్మాణం
న్యాయం చేయాలని కలెక్టర్‌ను ఆశ్రయించిన బాధిత మహిళ
పంచాయతీ కార్యదర్శి, కబ్జాదారులపై ఫిర్యాదు
రక్షణ కల్పించాలంటూ కరీంనగర్ కలెక్టరేట్‌లో వినతి
కాకతీయ, కరీంనగర్: అదాలత్ ఉత్తర్వులు ఉన్నప్పటికీ తన సొంత భూమిని అక్రమంగా కబ్జా చేసి ప్రహరీ నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన గిరవేన కొమురమ్మ సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. బాధితురాలి కథనం ప్రకారం.. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెం.3972/2025 పరిధిలోని తన సొంత భూమిలోకి ఆత్మకూరు రాజయ్య, అతని కుటుంబ సభ్యులు అక్రమంగా ప్రవేశించి గోడ నిర్మాణం చేపట్టారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి సహకారంతోనే ఈ అక్రమ పనులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఈ భూవివాదంపై తాము ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, హుజూరాబాద్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు (IA నెం.7605/2026, OS నెం.950/2026) సదరు స్థలంలో పనులు నిలిపివేయాలంటూ తాత్కాలిక ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేసిందని కొమురమ్మ పేర్కొన్నారు. న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా ప్రత్యర్థులు నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఆర్డర్ కాపీలను స్థానిక పోలీసులకు సమర్పించినా తమకు రక్షణ కల్పించడం లేదని, పైగా తప్పుడు కేసులతో వేధిస్తున్నారని వాపోయారు. కబ్జాదారుల వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని పేర్కొన్న బాధితురాలు.. కలెక్టర్ తక్షణమే స్పందించి అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయించి, తమకు న్యాయం చేయాలని కోరారు.

