జమ్మికుంటలో నకిలీ పోలీసుల హల్చల్
వ్యాపారులపై దాడి, దోపిడీ
ట్రాలీని అడ్డగించి నిర్జన ప్రదేశానికి తరలింపు
బంగారం, నగదుతో పాటు ఫోన్‌పే ద్వారా వసూళ్లు
ఎడ్ల వ్యాపారులను బెదిరించి చితకబాదిన ముఠా
స్థానికుల రాకతో పరార్.. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు
కాకతీయ, హుజురాబాద్ : తాము పోలీసులమంటూ నమ్మించి పశువుల వ్యాపారులను దారుణంగా బెదిరించి, వారి వద్ద నుండి భారీగా బంగారం, నగదు దోచుకున్న ఘోర ఉదంతం జమ్మికుంట పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ దారుణ దోపిడీ ఘటన గురువారం నాడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తాము వేరే ప్రాంతంలో ఎడ్లను కొనుగోలు చేసి చిన్న ట్రాలీ వాహనంలో స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా, జమ్మికుంట పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలోకి రాగానే సుమారు 10 నుండి 13 మంది యువకులతో కూడిన ఒక పెద్ద ముఠా వారి వాహనాన్ని అడ్డగించింది.

నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దాడి
తమను తాము స్థానిక పోలీసులుగా పరిచయం చేసుకున్న సదరు దుండగులు.. వాహనంలో తనిఖీలు చేయాలంటూ వ్యాపారులను భయపెట్టారు. అనంతరం ఆ ట్రాలీని బలవంతంగా పట్టణ శివారులోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తరలించారు. చీకట్లోకి తీసుకెళ్లిన తర్వాత అసలు రంగు బయటపెట్టిన నకిలీ పోలీసులు.. బాధితులను తీవ్రంగా బెదిరిస్తూ విచక్షణారహితంగా చితకబాదారు. ప్రాణభయంతో వణికిపోయిన వ్యాపారుల వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, జేబుల్లో ఉన్న నగదును లాక్కున్నారు. అంతేకాకుండా దుండగులు అంతటితో ఆగకుండా, బాధితుల మొబైల్ ఫోన్లను లాక్కొని బలవంతంగా వారి డిజిటల్ వాలెట్ల నుండి ‘ఫోన్‌పే’ ద్వారా కూడా తమ ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో డబ్బులను ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఒకవేళ పోలీసులకు చెబితే ప్రాణాలు తీస్తామని తీవ్రంగా హెచ్చరించారు.
కొందరు అనుమానితులు అదుపులోకి..
ఈ క్రమంలోనే సమీపంలో వేరే స్థానికుల బైకుల శబ్దం వినబడటంతో, ఎవరైనా వస్తున్నారేమోనన్న భయంతో నిందితులు అక్కడి నుండి చీకట్లోకి పరారయ్యారు. దుండగులు వెళ్లిన వెంటనే బాధితులు లబోదిబోమంటూ జమ్మికుంట పోలీస్ స్టేషన్‌కు చేరుకుని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు జమ్మికుంట పట్టణంలో మంచి రాజకీయ పలుకుబడి ఉన్న కొందరు ముఖ్య నేతల అనుచరులేనన్న బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిని కేసు నుండి తప్పించేందుకు తెరవెనుక తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా, సాంకేతిక ఆధారాల సహాయంతో ఈ ఘటనకు సంబంధించిన కొందరు అనుమానితులను పోలీసులు ఇప్పటికే రహస్యంగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. రాత్రి వేళల్లో పోలీసుల పేరుతో జరుగుతున్న ఈ తరహా దోపిడీలతో స్థానిక వ్యాపార వర్గాలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.

