ధరణి’ తిప్పల నుంచి తప్పిస్తాం
రెవెన్యూ రికార్డులను సవరిస్తూ పేదలకు హక్కులు కల్పిస్తాం
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లిస్తాం
గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు
ఎంత కష్టమైనా సంక్షేమ పథకాల అమలులో ఈ ప్రభుత్వం వెనకడుగు వేయదు
రూపాయి లంచం లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లోకే నేరుగా ఇందిరమ్మ ఇళ్ల నిధులు
సత్తుపల్లి ‘ప్రజా దర్బార్’ వేదికగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కాకతీయ, ఖమ్మం బ్యూరో : గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ధరణి పోర్టల్‌లోని లోపాలతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, భూ రికార్డులను సవరిస్తూ పేదవాడికే సర్వాధికారాలు కల్పిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ఎంఆర్ గార్డెన్స్‌లో ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఆధ్వర్యంలో పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి మండలాలకు సంబంధించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – ప్రజా దర్బార్’ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి.. వందలాదిగా తరలివచ్చిన ప్రజల నుంచి స్వయంగా వినతులు స్వీకరించి, గత ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
బొమ్మల ఇళ్ల నాటకాలకు చెక్
ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని గత పాలకులు అడ్డగోలుగా 8,18,000 కోట్ల రూపాయల అప్పుల కుప్పగా మార్చారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. అయినప్పటికీ ఉన్న వనరులతోనే పేదవాడికి భద్రత, భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. గత పాలకుల కాలంలో ఎన్నికలు రాగానే ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బొమ్మలు చూపించి ఒట్టి కాగితాలకే పరిమితం చేశారని, కానీ తమ ప్రజా ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే 22,500 కోట్ల రూపాయలతో 4,50,000 ఇళ్లు మంజూరు చేసిందని వివరించారు. ఇప్పటికే 1,25,000 ఇళ్లు పూర్తి కాగా, జూన్ నాటికి మరో 1,00,000 ఇళ్లు సిద్ధమవుతాయన్నారు. వచ్చే జూన్ 2వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని ఘనంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో బటన్ నొక్కితే ఒక్క రూపాయి లంచం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే ప్రతి సోమవారం నిధులు జమ చేస్తున్నామన్నారు. ఇళ్లు కట్టుకునే పేదలకు ములకలపల్లి క్వారీ నుంచి నాణ్యమైన ఇసుకను ఉచితంగా అందిస్తామని చెప్పారు. గత పాలకుల హయాంలో నిరుద్యోగులను రోడ్డున పడేస్తే.. తమ ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలోనే 72,000 ఉద్యోగాలు భర్తీ చేసిందని, త్వరలోనే మరో కొత్త కొలువుల ప్రకటన రాబోతుందని తెలిపారు.
కాలపరిమితి లోగా భూముల కొలతలు
సత్తుపల్లి పట్టణ పరిధిలోని 399 సర్వే నంబర్ అంశంతో పాటు, చుట్టుపక్కల 9 గ్రామాల్లో ఉన్న దాదాపు 6,500 ఎకరాల భూ సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. పేదపల్లి, నారాయణపురం పరిసరాల్లోని 5,500 ఎకరాల పైచిలుకు భూములను క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో కొలతలు (సర్వే) చేపట్టి, స్వాధీనంలో ఉన్న అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని, పహానీలలో వారి పేర్లు ఎక్కించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ వేగంగా పూర్తి కావడానికి రైతులు, స్థానికులు అధికారులకు సహకరించాలని కోరారు. పాత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నిధుల బకాయిలు, ఇతర పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, 1 లేదా 2 రోజుల్లోనే ఫలితాలు వస్తాయని చెప్పారు.
అటవీ అడ్డంకులు వద్దు.. రైతులకు పూర్తి రక్షణ
రుద్రాక్షపల్లి, కొకపాడు, తాళపెంట, రామచంద్రాపురం, వెంకటగిరి సహా సరిహద్దుల్లోని 10 నుండి 12 గ్రామాల్లో నెలకొన్న అటవీ-రెవెన్యూ భూముల వివాదాలపై మంత్రి కఠిన ఆదేశాలు జారీ చేశారు. “ఈ వర్షాకాలం ప్రారంభం అయ్యేలోపే అటవీ సరిహద్దులను కొలిచి తేల్చాలి. మిగిలిన రెవెన్యూ భూమిలో తరతరాలుగా సాగు చేసుకుంటున్న పేదలకు పట్టాలు ఇచ్చే బాధ్యత నాదే” అని మంత్రి భరోసా ఇచ్చారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు పొందిన రైతులు సాగు కోసం బోర్లు వేసుకుంటుంటే అటవీ శాఖ అధికారులు ఎక్కడా అభ్యంతరాలు పెట్టవద్దని, జిల్లా అదనపు కలెక్టర్, ఉప కలెక్టర్లు ఈ వ్యవహారాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

