మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
ఎమ్మార్వోకు బీజేపీ నాయకుల వినతి
కాకతీయ, కారేపల్లి : సింగరేణి మండలంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు గురువారం ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ కేంద్రాలు లేకపోవడంతో దళారులు తక్కువ ధరలకే కొనుగోలు చేస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. తేమ శాతం పేరుతో రైతులను వేధించకుండా, మద్దతు ధరతో పారదర్శకంగా కొనుగోళ్లు చేపట్టాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు తురక నారాయణ, మండల అధ్యక్షుడు మేకల మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మాన్సింగ్, అధికార ప్రతినిధి సురేష్ బాబు, జిల్లా నాయకులు అజ్మీర బిచ్చ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

