భద్రాద్రి జిల్లాను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుదాం
సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యం
భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్
అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతోనే ప్రజాపాలన
: ఎమ్మెల్యే కూనంనేని
కొత్తగూడెం క్లబ్లో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ జిల్లా స్థాయి సదస్సు
కాకతీయ, కొత్తగూడెం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి సమావేశాన్ని శుక్రవారం కొత్తగూడెం క్లబ్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాల్స్‌ను కలెక్టర్, ఎమ్మెల్యేలు కలిసి పరిశీలించి, ప్రజలకు అందుతున్న సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అర్హులందరికీ ప్రభుత్వ సేవలు
సమావేశంలో జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. ప్రజలకు పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రగతి ప్రణాళికను అమలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లాలోని సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని తెలిపారు. గ్రామాలు, వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు, సంక్షేమ వారోత్సవాలను విస్తృతంగా నిర్వహించామని వివరించారు. అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమిష్టిగా కృషి చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ (ఆదర్శ) జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యం
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. జిల్లా అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక ఉత్తమ పథకాలను అమలు చేస్తోందని కొనియాడారు. ఈ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గ్రామాలు, పట్టణాల్లోని స్థానిక సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అనంతరం సభలో వివిధ శాఖల జిల్లా అధికారులు తమ ప్రగతి నివేదికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించగా, ముఖ్య అతిథులు ‘సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, అదనపు కలెక్టర్ విద్యా చందన, ఆయా మున్సిపాలిటీల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు మరియు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

