ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్య దారుణ హత్య?
క్లెయిమ్ కోసం ఉరివేసుకున్నట్లు చిత్రీకరించిన భర్త
తిరుమలాయపాలెం మండలం గోల్ తండాలో విషాదం
రూ.కోటి బీమా.. రూ.80 లక్షల హోమ్ లోన్ కోసమేనని బంధువుల ఆరోపణ
కాకతీయ, పాలేరు: ఇన్సూరెన్స్ సొమ్ము కోసం కట్టుకున్న భార్యనే భర్త దారుణంగా హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్న ఘటన పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం గోల్ తండాలో వెలుగుచూసింది. లబ్ధి కోసమే భార్యను చిత్రహింసలు పెట్టి చంపి, చివరకు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. గోల్ తండాకు చెందిన శివాజీ, మీనాక్షిలకు 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు పాతర్లపాడు స్టేజి సమీపంలోని గోల్ తండాలో కాపురం ఉంటున్నారు. భార్య మీనాక్షి పేరు మీద ఇంటిపై రూ.80 లక్షల హోమ్ లోన్ ఉండటంతో పాటు, ఆమె పేరిట రూ.కోటి రూపాయల భారీ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఉంది. ఈ క్రమంలో ఇన్సూరెన్స్ డబ్బులు క్లెయిమ్ చేసుకోవాలనే దురాశతో భర్త శివాజీ గత కొంతకాలంగా భార్యను వేధిస్తున్నాడు. గతంలోనూ ఆమెను కిందపడేసి పిడిగుద్దులతో హింసించిన దృశ్యాలను బంధువులు మీడియాకు చూపిస్తూ భర్త శాడిజాన్ని వివరించారు. గురువారం మీనాక్షిని దారుణంగా హత్య చేసిన శివాజీ, ఆ తర్వాత ఆమె ఉరివేసుకుని చనిపోయినట్లుగా చిత్రీకరించి ఘటనాస్థలి నుంచి పరారయ్యాడు. ఇన్సూరెన్స్ డబ్బు కోసమే ఈ హత్య జరిగిందా..? లేక శివాజీ మనసులో మరేదైనా దురుద్దేశం ఉందా..? అనే కోణంలో పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

