ఇంకెన్నాళ్లు అద్దె గదుల్లోనే పోలీస్ స్టేషన్ ?
శంకరపట్నం స్టేషన్‌కు శాశ్వత భవనం ఎప్పుడో!
శిథిల భవనం నుంచి అద్దె గదులకు మారిన శంకరపట్నం పీఎస్
తాత్కాలిక భవనాన్ని ప్రారంభించిన సీపీ గౌస్ ఆలం
శాశ్వత భవనంపై మాత్రం ముందడుగు శూన్యం
కాకతీయ, శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతుండడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజల రక్షణ కోసం నిరంతరం శ్రమించే పోలీస్ యంత్రాంగానికి సొంత భవనం లేకపోవడం, అద్దె గదుల్లోనే ఇరుకుగా విధులు నిర్వహించాల్సి రావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో స్వయంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) గౌస్ ఆలం వచ్చి ఈ అద్దె భవనాన్ని ప్రారంభించినప్పటికీ.. శాశ్వత కొత్త భవన నిర్మాణ ప్రక్రియను మాత్రం అధికారులు విస్మరించారనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో శంకరపట్నం పోలీస్ స్టేషన్ కొనసాగిన పాత ప్రభుత్వ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. గోడలు పగిలిపోవడం, వర్షం వస్తే పైకప్పు పెచ్చులు ఊడి కిందపడే పరిస్థితి ఏర్పడటంతో అక్కడ విధులు నిర్వహించడం సిబ్బందికి ప్రాణసంకటంగా మారింది. ఈ ప్రమాదకర స్థితిని గమనించిన ఉన్నతాధికారులు.. అత్యవసరంగా తాత్కాలిక చర్యల కింద సిబ్బందిని, స్టేషన్ రికార్డులను ప్రస్తుత అద్దె భవనానికి తరలించారు. అయితే, తాత్కాలికంగా మారిన ఈ అద్దె గదుల వ్యవస్థే నెలలు గడుస్తున్నా శాశ్వతంగా మారిపోవడం పట్ల మండల ప్రజల్లో, ప్రజాసంఘాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అసలు కొత్త భవనం నిర్మిస్తారా..? లేక పాత భవనానికే భారీ మరమ్మతులు చేపడతారా..? అనే విషయంపై పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ నుండి గానీ, జిల్లా యంత్రాంగం నుండి గానీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేకపోవడం గమనార్హం.
నిధుల కొరతా..? అధికారుల నిర్లక్ష్యమా..?
కోట్ల రూపాయల బడ్జెట్‌తో నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పుకునే ప్రభుత్వాలు.. ప్రజల శాంతిభద్రతలను కాపాడే రక్షక భట నిలయానికి మాత్రం సరైన స్థలం, భవనం కేటాయించలేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఇది నిధుల కొరత వల్ల ఆగిపోయిందా లేక ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల ఫైళ్లు పెండింగ్‌లో పడ్డాయా అనే ప్రశ్నలు మండలంలో వినిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులు కూర్చోవడానికి, కనీసం వాహనాలు నిలపడానికి కూడా ఈ అద్దె భవనం వద్ద సరైన వసతులు లేవని స్థానికులు వాపోతున్నారు.
శాశ్వత భవనానికి ముహూర్తం ఎప్పుడు?
పోలీస్ శాఖకు ఆధునిక మౌలిక వసతులు కల్పించినప్పుడే సిబ్బంది మరింత సమర్థవంతంగా, ఉత్సాహంగా సేవలు అందించే అవకాశం ఉంటుంది. సిబ్బంది గౌరవప్రదమైన వాతావరణంలో, పూర్తిస్థాయి సౌకర్యాలతో విధులు నిర్వహించేలా ప్రభుత్వం శంకరపట్నం పోలీస్ స్టేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి శంకరపట్నం పోలీస్ స్టేషన్‌కు ఆధునిక సదుపాయాలతో కూడిన శాశ్వత భవన నిర్మాణానికి తక్షణమే నిధులు మంజూరు చేయాలని, ఇందుకు సంబంధించిన పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

