పూర్వ విద్యార్థుల సమ్మేళనం
మొలంగూర్ హైస్కూల్లో ఆత్మీయ వేడుక
ఉపాధ్యాయులకు ఘన సన్మానం.. పాఠశాలకు వస్తువుల విరాళం
కాకతీయ,శంకరపట్నం: శంకరపట్నం మండలం మొలంగూర్ ఉన్నత పాఠశాలలో 2003-04 విద్యాసంవత్సరానికి చెందిన ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. సుమారు 23 ఏళ్ల తర్వాత ఒకేచోట కలుసుకున్న మిత్రులు, తమ పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పూర్వ విద్యార్థులు శాలువాలు, మెమెంటోలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞత చాటుకున్నారు. అలాగే తమ బ్యాచ్ జ్ఞాపకార్థంగా పాఠశాల విద్యార్థుల భోజన వసతి కోసం రూ. 5,000 విలువైన స్టీల్ ప్లేట్లు, జగ్గులు, గ్లాసులను ప్రధానోపాధ్యాయురాలు కంకణాల నీరజకు అందజేశారు.
పాఠశాలపై ప్రేమాభిమానాలు చాటుతూ వస్తు సామగ్రిని బహూకరించిన పూర్వ విద్యార్థులను హెచ్ఎం కంకణాల నీరజ ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంపునకు కూడా అందరూ సహకరించాలని ఆమె కోరారు.

