ఎన్నికలు లేవు.. నిధులు లేవు
జూలూరుపాడు గ్రామ పంచాయతీలో సంక్షోభం!
ఎన్నికలు జరగక, ప్రభుత్వ నిధులు రాక దయనీయంగా గ్రామం పరిస్థితి
తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తం
హెడ్‌క్వార్టర్ పంచాయతీలోనే నిలిచిపోయిన అభివృద్ధి
ప్రత్యేక నిధులు (గ్రాంట్లు) కేటాయించాలని గ్రామస్థుల విజ్ఞప్తి
కాకతీయ, జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రం (హెడ్‌క్వార్టర్) అయిన జూలూరుపాడు గ్రామ పంచాయతీ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక, పరిపాలనా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మండలంలోని మొత్తం 24 గ్రామ పంచాయతీలకు గానూ 23 పంచాయతీలకు ఎన్నికలు జరిగి పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. అయితే, కీలకమైన జూలూరుపాడు గ్రామ పంచాయతీకి మాత్రం ఎన్నికలు జరగకపోవడంతో ఇక్కడ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా పరిస్థితి మారింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడం, ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ఈ గ్రామ పంచాయతీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన అధికారిక నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. దీనితో గ్రామంలో అభివృద్ధి పనులు స్తంభించిపోయి, ప్రజలు తమ నిత్యజీవితంలో కనీస అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దెబ్బతిన్న ప్రాథమిక సదుపాయాలు
నిధుల నిలిపివేత కారణంగా గ్రామంలో తాగునీటి సరఫరా గంటల వ్యవధిలోనే కాకుండా రోజులు గడుస్తున్నా అందని పరిస్థితి నెలకొంది. పారిశుధ్య నిర్వహణ, వీధుల్లో చెత్త సేకరణ, డ్రైనేజీల పూడికతీత పనులు పూర్తిగా పడకేశాయి. వీధి దీపాలు వెలగక రాత్రి వేళల్లో గ్రామం అంధకారంగా మారుతోంది. గ్రామ పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉన్న పరిమిత వనరులతోనే ఏదో ఒక రకంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. నిధులు లేకపోవడంతో సమస్యలు రోజురోజుకీ కొండలా పేరుకుపోతున్నాయి.
పెరిగిపోతున్న ప్రజా అసంతృప్తి
కండ్లముందే గ్రామం అధ్వానంగా మారుతున్నా, కనీసం అత్యవసర పనులు కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో పంచాయతీ యంత్రాంగం ఉండటం స్థానికులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. హెడ్‌క్వార్టర్ పంచాయతీలోనే ఈ స్థాయి నిర్లక్ష్యం ఉంటే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో కనీస వసతులు కరువవడంతో స్థానిక ప్రజల్లో ప్రభుత్వం, అధికారుల తీరుపై అసంతృప్తి వ్యతిరేకతగా మారుతోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల మంత్రులు స్పందించి.. జూలూరుపాడు గ్రామ పంచాయతీకి ప్రత్యేక నిధులు కేటాయించాలని గ్రామ ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గం వచ్చేంత వరకు తాత్కాలిక పరిష్కారంగానైనా ప్రత్యేక గ్రాంట్లు మంజూరు చేసి, గ్రామంలో మౌలిక వసతులను పునరుద్ధరించాలని కోరుతున్నారు. మరి ఈ దయనీయ స్థితిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటారా.. లేక కాలయాపన చేస్తారా అన్నది చూడాల్సి ఉంది.

