ఇందిరమ్మ చీరల పంపిణీకి బ్రేక్!
36వ డివిజన్‌లో గోడౌన్‌కే పరిమితం
రాజకీయ ప్రాబల్యం కోసమే అడ్డుకుంటున్నారు
తాజా మాజీ కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు ఆరోపణ
రెండు రోజుల్లో అందజేస్తామని జేసీ శ్రీనివాసరెడ్డి హామీ
కాకతీయ,ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని 36వ డివిజన్‌లో అర్హులైన మహిళలకు ఇందిరమ్మ చీరలు అందకుండా అధికార పార్టీకి చెందిన ఒక మాజీ కౌన్సిలర్ అడ్డుకుంటున్నారని డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు ఆరోపించారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి (గ్రీవెన్స్ డే) కార్యక్రమంలో ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస రెడ్డిని కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సజావుగా ముగిసిందని, కానీ 36వ డివిజన్‌లో మాత్రం మహిళలకు అందకుండా గోడౌన్‌కే పరిమితం చేశారని మండిపడ్డారు. డివిజన్ మాజీ కౌన్సిలర్ తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి, అప్పటి కార్పొరేటర్ పదవీకాలం ముగిసే వరకు కావాలనే కాలయాపన చేశారని ఆరోపించారు. కార్పొరేటర్ పదవీకాలం ముగిసి 20 రోజులు గడుస్తున్నా.. సదరు మాజీ కౌన్సిలర్ తన చేతుల మీదుగా చీరలు పంపిణీ చేసి, రాజకీయ ప్రాబల్యం పెంచుకోవాలని చూస్తూ పేద మహిళలకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. గత నెల రోజులుగా డివిజన్‌లోని పలు ప్రాంతాల మహిళలు చీరల పంపిణీ గురించి తన దృష్టికి తీసుకురావడంతోనే ఈ రోజు జేసీ దృష్టికి తీసుకెళ్లినట్లు రామ్మోహన్‌రావు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జాయింట్ కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.. ఒకటి రెండు రోజుల్లోనే గోడౌన్ నుంచి చీరలను విడుదల చేసి మహిళలకు సక్రమంగా పంపిణీ అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జేసీకి రామ్మోహన్ రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

