ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ
లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు కండక్టర్ ఆరోపణ
తృటిలో తప్పిన మరో ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం
కాకతీయ,మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు-ఖమ్మం ప్రధాన రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. బిజీ కొత్తూరు-మొండికుంట గ్రామాల మధ్య గల కట్టుకాలువ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సును వెనుక నుంచి ఒక లారీ బలంగా ఢీకొట్టింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, మద్యం మత్తే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. బస్సులోని ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక వివరాల ప్రకారం.. మణుగూరు నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న పల్లె వెలుగు బస్సు కట్టుకాలువ మలుపు వద్దకు రాగానే, వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది. లారీ డ్రైవర్ పూర్తిగా మద్యం సేవించి, అజాగ్రత్తగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బస్సు కండక్టర్ ఆరోపించారు. ఇదే సమయంలో రోడ్డుపై విద్యుత్ స్తంభాల లోడుతో వెళ్తున్న ఒక ట్రాక్టర్‌ను కూడా ఈ లారీ ఢీకొట్టబోయిందని, డ్రైవర్ అప్రమత్తతతో ఆ ముప్పు కూడా తృటిలో తప్పిందని ఆయన వివరించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రయాణికులను ప్రత్యామ్నాయ బస్సులో గమ్యస్థానాలకు చేర్చారు.


