తాడికల్లో ఘనంగా మహిళా వారోత్సవాలు
మహిళలకు పోషకాహారం, బాల్య వివాహాలపై అవగాహన
కాకతీయ,శంకరపట్నం: మండలంలోని తాడికల్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ ఆధ్వర్యంలో మహిళా వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ దుర్గపు సుజాత తిరుపతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఐరన్, ఇతర పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. తక్కువ ఖర్చుతో లభించే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని అవగాహన కల్పించారు. అనంతరం ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ మాట్లాడుతూ.. మహిళలకు పోషకాహార ప్రాముఖ్యతను వివరిస్తూనే, జంక్ ఫుడ్ వల్ల కలిగే అనర్థాలను హెచ్చరించారు. నిత్య జీవితంలో చక్కెర, ఉప్పు, నూనె వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలన్నారు. మహిళా సాధికారత జెండర్ స్పెషలిస్ట్ కవిత బాల్య వివాహాల నిరోధంపై అవగాహన కల్పిస్తూ.. వాటి వల్ల ఎదురయ్యే శారీరక, మానసిక దుష్పరిణామాలను వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ప్రవీణ్, వార్డు సభ్యులు, ఐకేపీ సీసీ అజీమ్, గ్రామ కార్యదర్శి హైమ, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.

