చచ్చిన మేకలనే కోస్తాం.. ఐతే ఏంటి!
మామూళ్లు ఇస్తున్నాం.. మా జోలికి రారు
అధికారులపై మటన్ వ్యాపారుల బరితెగింపు
మణుగూరు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం
ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోని శాఖల అధికారులు
కాకతీయ, మణుగూరు : మణుగూరు పట్టణంలో మటన్ వ్యాపారస్తులు బరితెగించారు. “మా దందా మా ఇష్టం… మమ్మల్ని అడిగేవారే లేరు” అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి సామాన్య ప్రజల ప్రాణాలతో యథేచ్ఛగా చెలగాటమాడుతున్నారు. చచ్చిన మేకలు, గొర్రెలనే కోసి అమ్ముతాం.. ఐతే ఏంటని, చచ్చిన మాంసం తిని ఎవరూ చనిపోలేదు కదా అంటూ బహిరంగంగానే వ్యంగ్యంగా మాట్లాడుతుండటం స్థానికంగా కలకలం రేపుతోంది. అధికారుల అనుమతులు మాకెందుకు అంటూ కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. నెలనెలా ఎవరికి ఇవ్వాల్సిన మామూళ్లు వారికి ఇస్తున్నామని, అందుకే అధికారులు తమ జోలికి రారంటూ మార్కెట్‌లో బహిరంగంగా చర్చించుకోవడం వెనుక మున్సిపాలిటీ, పశుసంవర్ధక, ఆహార భద్రతా శాఖల అధికారుల పాత్ర ఎంత ఉందో స్పష్టమవుతోంది.

నిబంధనలు సున్నా.. అంతా రోత!
ప్రతి మటన్ దుకాణదారుడు ఆహార భద్రత ప్రమాణాల సంస్థ నుంచి లైసెన్స్, స్థానిక మున్సిపాలిటీ నుంచి వ్యాపార అనుమతి పత్రం (ట్రేడ్ లైసెన్స్), నిరాక్షేపణ పత్రం ఖచ్చితంగా పొందాలి. కానీ ఇక్కడ ఏ ఒక్క దుకాణానికి ఇవి లేవని తెలుస్తోంది. పశుసంవర్ధక శాఖ నిబంధనల ప్రకారం అనారోగ్యంతో ఉన్న లేదా చనిపోయిన జీవాలను విక్రయించకూడదు. మున్సిపల్ కసాయిఖానాలోనే వాటిని వధించి, పశువైద్యుడు పరీక్షించాక వేసే అధికారిక ముద్ర ఉన్న మాంసాన్ని మాత్రమే అమ్మాలి. కానీ ఇక్కడ లాభాలే ధ్యేయంగా రోడ్డు పక్కనే, ప్రజలకు కనిపించేలా జీవాలను కోస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. దుకాణాలన్నీ ఈగలు, దోమలు, దుమ్ముతో నిండి రోతగా కనిపిస్తున్నాయి. మాంసానికి అద్దాల తెరలు (గ్లాస్ స్క్రీన్లు) అమర్చలేదు. వ్యర్థాలను, రక్తాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం లేదు. కత్తులు, కోసే పలకలను (చాపింగ్ బోర్డులను) కడగడం లేదు. బతికి ఉన్న మేకను కోస్తే ఒక ధర, చచ్చిన దాన్ని కోస్తే మరో ధర తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తూకంలో మోసాలు చేస్తూ, బరువు పెరగడానికి మాంసంలో నీరు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు ఇంతగా రెచ్చిపోతున్నా మున్సిపాలిటీ, పశుసంవర్ధక, ఆహార భద్రతా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. తనిఖీలు చేయాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే కఠిన చర్యలు: ప్రసాద్, మణుగూరు మున్సిపల్ కమిషనర్
ఈ విషయమై మున్సిపల్ కమిషనర్‌ను వివరణ కోరగా.. పట్టణంలోని మటన్ వ్యాపారస్తుల్లో ఒక్కరికి కూడా ట్రేడ్ లైసెన్స్, నిరాక్షేపణ పత్రాలు లేవని, అద్దాలు కూడా అమర్చలేదని అంగీకరించారు. ఇప్పటికే వ్యాపారస్తులందరినీ పిలిచి ప్రభుత్వ నిబంధనలు పాటించాలని చెప్పామని, నిబంధనలకు విరుద్ధంగా నడిపితే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మున్సిపాలిటీ నుంచి అర్జీ రాలేదు : సరస్వతీ, పశుసంవర్ధక శాఖ అధికారి
పశుసంవర్ధక శాఖ అధికారిని వివరణ కోరగా.. జీవాలు ఆరోగ్యంగా ఉన్నాయో లేదో పరీక్షించడానికి మున్సిపాలిటీ శాఖ వారు తమకు లేఖ ద్వారా అర్జీ పెట్టాల్సి ఉంటుందని తెలిపారు. అప్పుడు తాము వచ్చి పరీక్షించి, ఆరోగ్యంగా ఉన్న వాటికి ముద్ర వేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు మున్సిపాలిటీ నుంచి తమకు ఎటువంటి అర్జీ రాలేదని ఆమె స్పష్టం చేశారు.

