ఇందుర్తిలో కిరాణా దుకాణాల దందా
మృదు పానీయాలు, నిత్యావసరాలపై అధిక వసూళ్లు
కాలం చెల్లిన ఆహార పదార్థాల విక్రయం
చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం.. తనిఖీలకు ప్రజల డిమాండ్
కాకతీయ, చిగురుమామిడి : మండలంలోని ఇందుర్తి గ్రామంలోని పలు కిరాణా, జనరల్ స్టోర్లలో వినియోగదారుల హక్కులకు భంగం వాటిల్లుతోంది. కొందరు వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘిస్తూ నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. నిత్యావసర వస్తువులు, పాలు, కూల్‌డ్రింక్స్, ప్యాక్డ్ ఫుడ్స్ వంటి వాటిని గరిష్ట రిటైల్ ధర (ఎమ్మార్పీ) కంటే ఎక్కువ రేట్లకు విక్రయిస్తూ అక్రమ వసూళ్లకు తెగబడుతున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఈ దందా సాగిస్తున్నారు. అదనపు వసూళ్ల కంటే ప్రమాదకరంగా అనేక దుకాణాల్లో గడువు ముగిసిన (ఎక్స్‌పైరీ డేట్) ఆహార పదార్థాలను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. చిన్న పిల్లలు తినే బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్ ప్యాకెట్ల నుంచి మొదలుకొని వంట నూనెలు, మసాలా దినుసుల వరకు గడువు దాటిపోయినా షెల్ఫ్‌లలో ఉంచి అమ్ముతున్నారు. వీటిని గమనించకుండా కొనుగోలు చేసి తింటున్న ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని స్థానికులు మండిపడుతున్నారు.
తనిఖీలు చేపట్టాలి
వినియోగదారులను మోసం చేస్తూ, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న కిరాణా దుకాణాలపై లీగల్ మెట్రాలజీ (తూనికలు, కొలతల శాఖ), ఆహార భద్రతా అధికారులు తక్షణమే స్పందిాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలపై భారీ జరిమానాలు విధించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటువంటి మోసాలపై వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. వస్తువులు కొనేముందు ధర, గడువు తేదీలను పరిశీలించాలి. అక్రమ విక్రయాలపై టోల్ ఫ్రీ నంబర్ 1915 ద్వారా జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌కు లేదా స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

