అక్రమంగా తరలిస్తున్న బెల్లం, పటిక పట్టివేత!
500 కేజీల బెల్లం, 50 కేజీల పటిక, వాహనం స్వాధీనం
ఇద్దరు నిందితులపై కేసు నమోదు.. ఎక్సైజ్ అధికారుల చర్యలు
కాకతీయ, పాలేరు: నాటుసారా తయారీకి గుంటూరు నుంచి మహబూబాబాద్ జిల్లాకు అక్రమంగా రవాణా చేస్తున్న ముడి పదార్థాలను నేలకొండపల్లి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారులు బుధవారం పట్టుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. ముదిగొండ మండలం వల్లభి గ్రామం వద్ద ఎక్సైజ్ అధికారులు విశ్వసనీయ సమాచారంతో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో గుంటూరు ప్రాంతం నుండి మహబూబాబాద్ జిల్లా పరిసర తండాల్లోని నాటుసారా తయారీదారులకు సరఫరా చేసేందుకు తరలిస్తున్న 10 బస్తాల (500 కేజీలు) బెల్లం, 50 కేజీల పటికను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రవాణాకు ఉపయోగించిన వాహనంతో పాటు రెండు సెల్‌ఫోన్లను సీజ్ చేశారు. ఈ కేసులో మహబూబాబాద్ జిల్లాకు చెందిన డ్రైవర్ కర్లపాటి స్వామి (A1), కొండాపురం గ్రామానికి చెందిన ఎస్. యాకూబ్ పాషా (A2)లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడిలో ఎక్సైజ్ సీఐ సుంకరి రమేష్ పర్యవేక్షణలో ఎస్ఐ టి. లత, సిబ్బంది ముత్తయ్య, ప్రవీణ్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

