ఆడబిడ్డల జీవితాలతో రాజకీయాలా?
గర్భం లేదని వైద్య పరీక్షల్లో తేలినా ఇంకా విష ప్రచారమేనా?
బాలికను బజార్లో నిలబెట్టి శునకానందం పొందుతున్నారు
ఆధారాలు ఉంటే బయటపెట్టండి.. లేకపోతే కేసులు ఖాయం
మేడారం జాతరపైనా ప్రతిపక్షాలు కుట్రపూరిత అసత్య ప్రచారాలు
మంత్రి సీతక్క ధ్వజం
కాకతీయ, ఏటూరునాగారం : “రాజకీయంగా మా మీద పోరాడండి.. కానీ అమాయక మైనర్ బాలికలను రోడ్డుమీదకు ఈడ్చొద్దు. ఒక 14 ఏళ్ల ఆడబిడ్డ జీవితాన్ని గర్భం, అత్యాచారం అంటూ బజార్లో పెట్టడం మానవత్వానికే మచ్చ” అని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ములుగు జిల్లా ఏటూరునాగారంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రెండు రోజులుగా మైనర్ బాలికపై జరుగుతున్న దుష్ప్రచారం వెనుక రాజకీయ కక్ష, మహిళా వ్యతిరేక కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు.
కొన్ని రాజకీయ పార్టీల సోషల్ మీడియా వర్గాలు, కొందరు మీడియా ప్రతినిధులు కలిసి ఒక కాంగ్రెస్ నాయకురాలి కుమారుడి పేరును ఇందులోకి లాగి కావాలనే విష ప్రచారం చేశారని మంత్రి సీతక్క ఆరోపించారు. చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు స్పందించి బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారని, ఆ పరీక్షల్లో ఎటువంటి గర్భం లేదని, ఎలాంటి అగాయిత్యం జరగలేదని స్పష్టమైన నివేదిక వచ్చిందని మంత్రి వెల్లడించారు. బాలిక తల్లిదండ్రులు కూడా తమ బిడ్డకు ఎలాంటి అన్యాయం జరగలేదని, మూడు రోజులుగా కుటుంబం అంతా తీవ్ర మానసిక వేదన అనుభవిస్తోందని కన్నీరు పెట్టుకున్నారని తెలిపారు. ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన మహిళా నాయకురాలు నిజాయితీగా ఎదగడాన్ని జీర్ణించుకోలేక, రాజకీయంగా ఎదుర్కోలేక చివరకు మైనర్ బాలిక పేరును లాగడం దారుణమన్నారు. ఆధారాలు ఉంటే పోలీసులకు ఇవ్వాలని, లేనిపక్షంలో తప్పుడు వార్తలు రాసిన వారిపై చట్టప్రకారం కఠిన సెక్షన్ల కింద కేసులు పెడతామని హెచ్చరించారు.
మేడారం జాతరపైనా అసత్య ప్రచారాలు
మేడారం జాతర అద్భుతంగా నిర్వహించబడిన తీరును ఓర్చుకోలేక కొందరు కావాలనే తప్పుడు వీడియోలు, అసత్య ప్రచారాలు చేశారని మంత్రి సీతక్క ఆరోపించారు. ఒక దుకాణానికి సంబంధించిన చిన్న వివాదాన్ని వక్రీకరించి, బయట ప్రాంతాల గ్యాంగులు వచ్చి మహిళలను ఎత్తుకెళ్లారంటూ సంచలన కథనాలు సృష్టించారని మండిపడ్డారు. ఈ ఘటనలపై మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌తో పాటు పోలీస్ శాఖ కూడా విచారణ జరిపి అందులో ఎటువంటి వాస్తవం లేదని తేల్చిందని వెల్లడించారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్షాలు మహిళలు, మైనర్ బాలికల జీవితాలతో రాజకీయ ఆటలు ఆడుతున్నాయని విమర్శించారు. తప్పుడు ప్రచారాలతో కుటుంబాలను మానసికంగా చంపే వారిని సమాజం ప్రశ్నించాలని, బాధితులకు అండగా నిలవాలని ఏటూరునాగారం ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

