అనాథ చిన్నారుల సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యం
బాల్య వివాహాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలి
పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
ములుగులో నూతన బాలసదనం భవనం ప్రారంభం
కాకతీయ, ములుగు ప్రతినిధి : అనాథ, నిరాశ్రయ చిన్నారుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. ములుగు జిల్లా గట్టమ్మ దేవాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన బాలసదనం భవనాన్ని మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అనాథలు, సంరక్షణ అవసరమైన చిన్నారులకు సురక్షితమైన వసతి, నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించి వారి భవిష్యత్తును బంగారు బాటగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తల్లిదండ్రులకు దూరమైన పిల్లలకు ప్రభుత్వ సంస్థలే కుటుంబ సభ్యులుగా నిలవాలని అధికారులకు సూచించారు. బాలసదనాలు, సంప్రదింపుల కేంద్రాలకు వచ్చే బాధిత మహిళలు, బాలికలతో సిబ్బంది స్నేహపూర్వకంగా ఉంటూ వారిలో ఆత్మస్థైర్యం నింపాలన్నారు. సమాజంలో బాల్య వివాహాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని, బడులు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చట్టపరమైన శిక్షలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రతి బాలిక చదువు పూర్తి చేసుకుని స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంపత్ రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

