అమరుల త్యాగమే నేటి తెలంగాణ
ఆత్మకూరులో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
కాకతీయ,ఆత్మకూరు : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న అమరవీరుల త్యాగానికి ప్రతిరూపమే నేటి తెలంగాణ అని ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆత్మకూరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నాయిని జగన్మోహన్ రెడ్డి జెండా ఎగురవేశారు. అలాగే హౌస్ బుజుర్గ్ గ్రామ పంచాయతీతో పాటు మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి అవతరణ వేడుకలను జరుపుకున్నారు. ఈయా కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

