మాది పెత్తనం కాదు సేవ!
కుట్రలను తిప్పికొట్టిన ప్రజలు
దేశంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ
యాసంగి ధాన్యం సేకరణలో 60 శాతం వాటాతో తెలంగాణ అగ్రస్థానం
వ్యవసాయం, రైతు సంక్షేమానికి రూ.1,56,496 కోట్ల భారీ వ్యయం
మహిళా సంఘాలకు రూ.1,00,000 కోట్ల రుణాలు
అగ్రికల్చరల్ ఏకో సిస్టమ్‌తో రైతులను శ్రీమంతులను చేస్తాం
రుణ విముక్తులుగా 25 లక్షల మంది రైతులు.. రికార్డు స్థాయి దిగుబడులు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
త్యాగాల చరిత్రను స్మరిస్తూ విధాన పత్రం ఆవిష్కరణ
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ స్వరాష్ట్ర అస్తిత్వం కోసం జరిగిన దశాబ్దాల ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలకు, తెగువకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. కోటి రతనాల వీణ అయిన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆయన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏటా త్యాగాల చరిత్రను స్మరిస్తూ, రేపటి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసుకునే ఒక భావోద్వేగ సందర్భం జూన్ 2 అని ఆయన పేర్కొన్నారు. మనం కలలు కన్న స్వరాష్ట్ర స్వప్నాన్ని నిజం చేసిన ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ మన్మోహన్ సింగ్, నాటి యూపీఏ చైర్‌పర్సన్ శ్రీమతి సోనియాగాంధీలకు తెలంగాణ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పుట్టుక నీది… చావు నీది, బతుకంతా దేశానిది అన్న ప్రజా కవి కాళోజీ మాటల స్ఫూర్తితోనే, ప్రతిక్షణం తెలంగాణ హితమే పరమార్థంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
కుట్రలను తిప్పికొట్టిన ప్రజలు.. మాది పెత్తనం కాదు సేవ!
రాష్ట్రంలో ఈ రెండున్నరేళ్లలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ పట్ల చూపించిన ఆదరణ, అభిమానం మరువలేనిదని ముఖ్యమంత్రి అన్నారు. ఎవరెన్ని విమర్శలు, కుట్రలు చేసినా ప్రజలు అండగా నిలవడం తమకు ఎనలేని శక్తిని ఇచ్చిందని, ప్రజల సంక్షేమం పట్ల బాధ్యతను మరింత పెంచిందని చెప్పారు. రైతులు, యువత, ఆడబిడ్డల ఆకాంక్షలు, అన్ని వర్గాల సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సాధన కోసం 30 నెలలుగా నిరంతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు. రాచరిక ఆలోచనలు, నియంతృత్వ పోకడలను ఓడించి కొత్త చరిత్రను రాసుకోవడం కోసమే ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారని గుర్తు చేశారు. తాము ఈ అవకాశాన్ని అధికారం అని సంబోధించడం లేదని, ప్రజలకు సేవకులుగానే బాధ్యత నిర్వర్తిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం అంటే నలుగురి చేతుల్లో పెత్తనం కాదు, 4 కోట్ల ప్రజల ఉమ్మడి ప్రతినిధి అని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
రుణ విముక్తులుగా 25 లక్షల మంది రైతులు
సాగు భూమి, వ్యవసాయం, రైతు.. ఈ మూడే తెలంగాణకు ఊపిరి అని, వ్యవసాయ అనుబంధ రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతుల జీవితాల్లో మార్పు تేవాలన్న సంకల్పంతో ‘తెలంగాణ రైజింగ్ – 2047’ విధాన పత్రంలో దీనికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఇందులో భాగంగా ‘రూరల్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీ’ని అభివృద్ధి చేసి, అగ్రికల్చరల్ ఏకో సిస్టమ్ ద్వారా రైతులను శ్రీమంతులను చేయడమే తమ సంకల్పమన్నారు. 2025-26 అంచనాల ప్రకారం రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 236.87 లక్షల మెట్రిక్ టన్నులుగా నమోదైందని సీఎం తెలిపారు. రైతుల నెత్తిపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించేందుకు ఒకేసారి రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేశామని, ఇందుకోసం రూ.20,616 కోట్లు రైతుల ఖాతాల్లో వేసి దాదాపు 25 లక్షల మందిని రుణ విముక్తులను చేశామని గుర్తు చేశారు. ఈ రెండున్నరేళ్లలో వ్యవసాయం, రైతు సంక్షేమానికి మొత్తం రూ.1,56,496 కోట్లు ఖర్చు చేశామన్నారు. రైతుభరోసా కింద ఇప్పటివరకు రూ.27,529 కోట్లు నేరుగా రైతుల ఖాతాలలో వేశామని, ఈ ఏడాది ఇప్పటికే రూ.5,700 కోట్ల నిధులు జమ చేశామని వివరించారు.
పెండింగ్ ప్రాజెక్టులపై పట్టుదల
రైతులు దళారుల బారిన పడి మోసపోకూడదనే ఉద్దేశంతో చివరి గింజ వరకు కనీస మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. తాము అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లకు రూ.82,840 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ యాసంగి సీజన్‌లో 8575 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 63.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి, రూ.11,903 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని, దేశంలో యాసంగి సీజన్ మొత్తం సేకరణలో తెలంగాణ వాటానే 60 శాతం నమోదైందని గర్వంగా ప్రకటించారు. ఈ యాసంగిలో సుమారు 16 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 4 లక్షల ఎకరాల్లో జొన్న సాగు చేసి తెలంగాణ రైతులు కొత్త చరిత్ర సృష్టించారన్నారు. మొక్కజొన్నల కొనుగోళ్లకు సుమారు రూ.4,275 కోట్లు, జొన్న కొనుగోళ్లకు ఇప్పటి వరకు రూ.1,154 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించిందన్నారు.
అలాగే కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటాలు తేల్చి, ప్రాజెక్టులు పూర్తి చేసే విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ప్రాణహిత – చేవేళ్ల ప్రాజెక్టుకు తిరిగి ప్రాణం పోసేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశానని, తుమ్మడిహెట్టి బ్యారేజీ నిర్మించే కార్యాచరణ చేపడుతామని చెప్పారు. గత ప్రభుత్వం లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిపోవడంతో, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరించే పనులను మొదలు పెట్టామన్నారు.
మహిళా సంఘాలు.. ఆర్థిక శక్తి కేంద్రాలు
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టిందని సీఎం తెలిపారు. బ్యాంకు లింకేజీ స్త్రీ నిధి ద్వారా మహిళా సంఘాలకు రూ.1,00,000 కోట్లు రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే రూ.60,000 కోట్ల సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశామని చెప్పారు. రూ.5 లక్షల రుణ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామన్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లు, సౌర విద్యుత్తు ప్లాంట్లు, పెట్రోల్ బంకులకు మహిళలే నేడు యజమానులని, 1000 బస్సులకు వాళ్లే ఓనర్లుగా మారుతున్నారని చెప్పారు. ఇటీవలే రాష్ట్రమంతటా ఒకేరోజున 8,000 స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామని వివరించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ద్వారా రాష్ట్రంలోని ఆడబిడ్డలు దాదాపు రూ.10,000 కోట్లు ఆదా చేసుకోగలిగారని సీఎం తెలిపారు. మహాలక్ష్మి పథకంలో రాష్ట్రంలోని 42.90 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నామన్నారు. గృహజ్యోతి కింద 53.09 లక్షల పేదల గృహాలకు 200 యూనిట్ల ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు.
రికార్డు సమయంలో 67,763 ఉద్యోగాల భర్తీ
యువతకు ఇచ్చిన మాట ప్రకారం లీగల్ సమస్యలు లేకుండా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను విజయవంతంగా చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రికార్డు సమయంలో 67,763 పోస్టులను భర్తీ చేసి యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. ఈ నెలలోనే టీజీపీఎస్‌సీ ద్వారా ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అటవీశాఖ, టౌన్ అండ్ కంట్రీప్లానింగ్, విద్యాశాఖలలో ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నోటిఫికేషన్‌ల జారీ ప్రక్రియ నిరంతరంగా జరుగుతుందన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఇప్పటివరకు 1,190 మంది విద్యార్థులు కోర్సులు పూర్తి చేయగా, వారిలో 838 మంది మైక్రోసాఫ్ట్, ఫ్లిప్‌కార్ట్, టెక్ మహీంద్రా లాంటి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు సాధించటం ఆనందంగా ఉందన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ పథకాన్ని అమలు చేస్తామని, జూనియర్ కాలేజీలకు మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నామని ప్రకటించారు. మొదటి ఏడాదే రూ.22,500 కోట్లు కేటాయించి, 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, కేవలం 13 నెలల కాలంలోనే రాష్ట్రంలో లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. సెప్టెంబర్ 17వ తేదీ ప్రజా పాలన దినోత్సవం నాటికి మిగతా 2 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తం 3.50 లక్షల ఇళ్ల మంజూరు చేశామన్నారు.
15.12 లక్షల కొత్త రేషన్ కార్డులు.. కుల గణన సర్వే రోల్ మోడల్
రాష్ట్రవ్యాప్తంగా 15,12,000 కొత్త రేషన్ కార్డులను జారీ చేశామని, ప్రస్తుత కార్డుల్లో 19,44,000 కొత్త సభ్యుల పేర్లను చేర్చామని సీఎం తెలిపారు. దీనివల్ల రాష్ట్రంలో 3,00,28,000 మంది ఈరోజు సన్న బియ్యం భోజనం చేయగలిగే పరిస్థితి కల్పించామన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల గణన సర్వేను తమ ప్రభుత్వం విజయవంతంగా చేపట్టి వివరాలను వెల్లడించిందని, ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న జన గణనకు మన సర్వే రోల్ మోడల్‌గా నిలిచిందని గర్వంగా ప్రకటించారు. 59 షెడ్యూల్డ్ కులాలను 3 గ్రూపులుగా ఉపవర్గీకరించి అమలు కూడా ప్రారంభించామన్నారు. స్థానిక సంస్థల్లో, విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల కోసం ప్రతినెలా అదనంగా రూ.1,000 కోట్లు కేటాయిస్తున్నామని, కోటి రూపాయలతో ప్రత్యేక బీమా పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధికి ఇప్పటి వరకు దాదాపు రూ.11,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్, నిమ్స్ విస్తరణ, ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణం చేపట్టామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కవరేజీని రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచామన్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రత్యేకంగా ‘ఈగిల్’ దళాన్ని ఏర్పాటు చేశామన్నారు.
‘తెలంగాణ రైజింగ్ – 2047’ మాస్టర్ ప్లాన్
రాష్ట్రం మొత్తానికి కలిపి ఒకే మాస్టర్ ప్లాన్ రూపొందించిన ఘనత దేశంలో తెలంగాణకే దక్కిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వచ్చే వందేళ్ల పాటు తెలంగాణ గమ్యాన్ని గమనాన్ని ఇది నిర్దేశిస్తుందన్నారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలనేదే ప్రభుత్వ సంకల్పమన్నారు. ఈ విజన్ డాక్యుమెంట్‌లో రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్ , రేర్ ప్రాంతాలుగా వర్గీకరించి మూడంచెల వ్యూహాన్ని అనుసరిస్తున్నామన్నారు. ఓఆర్ ఆర్ లోపల ఉన్న ప్రాంతాన్ని ‘క్యూర్’ గా పరిగణించి ప్రపంచ స్థాయి సర్వీసెస్ హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. ఇందులో భాగంగానే జీహెచ్‌ఎంసీని సైబరాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లుగా పునర్వ్యవస్థీకరించామన్నారు.
సరస్సులు, చెరువుల పునరుద్ధరణ బాధ్యతను హైడ్రాకు అప్పగించి ఇప్పటివరకు దాదాపు రూ.60,000 కోట్ల విలువైన 1045 ఎకరాలకు పైగా కబ్జా భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నామన్నారు. చరిత్రలోనే తొలిసారిగా ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రజల ఆస్తిగా మార్చిందని ప్రకటించారు. ఫేజ్ 2 లో 7 కారిడార్లలో 122.9 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ డీపీఆర్ కేంద్రానికి సమర్పించామన్నారు. మూసీ ప్రక్షాళన ఫేజ్-1 పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు రూ.1,000 కోట్ల నిధులు కేటాయించామన్నారు.
30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ..
రీజినల్ రింగ్ రోడ్ , ఓఆర్ ఆర్ మధ్య ఉన్న ప్రాంతాన్ని ‘ప్యూర్’ జోన్‌గా మలిచి ఇన్‌ఫ్రాస్ట్రక్షర్, మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేస్తున్నామని, శంషాబాద్‌ను బుల్లెట్ రైలు కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. త్రిబుల్ ఆర్ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు ఉండే ‘రేర్’ ప్రాంతంలో సాగునీరు, వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి జరుగుతుందన్నారు. వరంగల్, ఆదిలాబాద్‌లో విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం పొందిందని, వరంగల్ విమానాశ్రయ అభివృద్ధికి అవసరమైన మొత్తం 950 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించిందన్నారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ద్వారా దాదాపు రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని, దేశంలోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో దాదాపు 20 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంచనాల్లో తెలంగాణ టాప్ అచీవర్‌గా నిలిచిందని, కొత్త టూరిజం పాలసీతో 3 లక్షల మందికి, లైఫ్ సైన్సెస్ పాలసీతో 5 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని, ప్రపంచానికే తెలంగాణను గేట్‌వేగా నిలబెట్టేందుకు ప్రజలందరి సహకారం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

