వరప్రదాయిని సీతారామ
ఎత్తిపోతల పథకంతో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం
ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులకు రూ.4,000 కోట్ల నిధులు మంజూరు
రూ.155 కోట్లతో మోడల్ మార్కెట్‌గా ఖమ్మం యార్డు
రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా పరిధిలోని సాగునీటి రంగాన్ని పూర్తిగా అగ్రపథంలో నిలిపేందుకు ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో అత్యంత వైభవంగా జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, జిల్లాకు వరప్రదాయినిగా మారిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల పురోగతిని, దాని ద్వారా జిల్లాకు చేకూరనున్న సాగునీటి ప్రయోజనాలను ప్రత్యేకంగా వివరించారు.

కాలువల పనుల వేగవంతం.. నిధుల వరద
ఖమ్మం జిల్లాలోని లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా సీతారామ ఎత్తిపోతల పథకం, జవహర్ ఎత్తిపోతల పనులను ప్రభుత్వం అత్యంత వేగవంతం చేసిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టు పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణ పనుల కోసం ఇప్పటికే రూ.4,000 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కాలువల నిర్మాణం, భూసేకరణ ప్రక్రియలను వేగంగా పూర్తి చేస్తున్నారన్నారు. ఈ పనులు త్వరలోనే తుది దశకు చేరుకోనున్నాయని, దీనివల్ల వచ్చే ఏడాది నాటికి జిల్లాలోని పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల పరిధిలోని ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందే అవకాశం ఉంటుందని భరోసా ఇచ్చారు.

రైతు భరోసా నిధుల జమ.. రూ.155 కోట్లతో మోడల్ మార్కెట్
ఖమ్మం జిల్లాలోని వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రైతు భరోసా పెట్టుబడి సాయం కింద ఈ యాసంగి సీజన్ లో జిల్లా వ్యాప్తంగా 3,43,997 మంది రైతులకు రూ.270.93 కోట్ల నిధులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతులు పండించిన పంటలకు సరైన మద్దతు ధర, మెరుగైన వసతులు కల్పించేందుకు గాను రూ.155 కోట్ల భారీ వ్యయంతో ఖమ్మం మార్కెట్ యార్డును మోడల్ మార్కెట్‌గా మారుస్తున్నామని వెల్లడించారు. రైతుల భూమిపై వారికి పూర్తి హక్కుల భద్రత కల్పించేందుకు గాను ప్రభుత్వం కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తుచేశారు.

