డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత
డ్రగ్స్ మత్తులో జీవితం నాశనం : ఎస్సై క్రాంతి కుమార్
కాకతీయ,తుంగతుర్తి : డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత అని, డ్రగ్స్ మత్తులో జీవితం నాశనం అవుతుందని ఎస్సై క్రాంతి కుమార్ అన్నారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజలకు డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు ప్రమాదాలు వంటి వాటిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై క్రాంతి కుమార్ ప్రజలతో ప్రతిజ్ఞ చేపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… శాంతియుత సమాజం మనందరి బాధ్యత అని డ్రగ్స్ వల్ల సమాజంలో యువశక్తి విచ్ఛిన్నం అవుతుందని, డ్రగ్స్ మత్తులో దాడులు, నేరాలు పెరుగుతున్నాయన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల శరీరంలో శక్తి తగ్గి మంచి భవిష్యత్‌ను కోల్పోతారన్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన వారి గురించి సమాచారం ఇవ్వాలని, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో మార్పునకు కృషి చేస్తామన్నారు. సాంఘిక వాతావరణం నెలకొని ఉన్న ప్రాంతాలు మాత్రమే సత్వర అభివృద్ధి సాధిస్తాయని శాంతిభద్రత పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. రోడ్డు భద్రత మన అందరి బాధ్యత అనీ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మహిళలు చిన్నారులతో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సైబర్ నేరాల బారిన పడిన వెంటనే షి టీమ్స్ లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ గురుస్వామి, రావులపల్లి, వెంపటి, సర్పంచులు చింతకుంట్ల మనోజ్, తప్పట్ల ఎల్లయ్య, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

