పర్యావరణ పరిరక్షణకే గ్రీన్ ఎనర్జీ
పాలేరు నియోజకవర్గంలో రూ.37.38 కోట్లతో విద్యుత్ పనులు
తిరుమలాయపాలెంలో సోలార్ ప్లాంట్ కు శంకుస్థాపన
రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు
సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా ముందుకు
రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ
రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కాకతీయ, పాలేరు : పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ వినియోగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని 33/11 కేవీ సబ్స్టేషన్ ఆవరణలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 0.8 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్, విద్యుత్ నియంత్రికల మరమ్మత్తు కేంద్రానికి అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యుత్ రంగ బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. నియోజకవర్గ పరిధిలో రూ.37.38 కోట్లతో విద్యుత్ సరఫరా మెరుగుదలకు పనులు చేపట్టామని, రూ.9 కోట్ల వ్యయంతో మూడు సబ్స్టేషన్ల నిర్మాణాలు సాగుతున్నాయని వివరించారు. దశాబ్దాలుగా ఇళ్లపై నుంచి వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ లైన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. నాటి ఉచిత విద్యుత్ స్ఫూర్తితోనే ప్రస్తుత ప్రభుత్వం రైతులకు నాణ్యమైన కరెంటు అందిస్తోందని గుర్తుచేశారు.
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు
అనంతరం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా చేసుకుని ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. మొదటి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, రెండో విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి అదనంగా మరో 2 వేల ఇళ్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా, కేవలం అర్హతే ప్రామాణికంగా ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని స్పష్టం చేశారు.
రైతులకు అండగా ప్రభుత్వం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా సంక్షేమ పథకాలను ఆపడం లేదని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, రైతు భరోసా సాయాన్ని ఎకరాకు రూ.12 వేలకు పెంచామన్నారు. దేశంలోనే రికార్డు స్థాయిలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తూ కొనుగోలు చేశామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ విజయవంతంగా అమలవుతున్నాయన్నారు. గడిచిన ఏడాది కాలంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదల వైద్యం కోసం రూ.1,034 కోట్లు వెచ్చించామని, నిరుద్యోగుల కోసం 72 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసచారీ, జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

