పరిహారం కోసం రైతు ఎదురుచూపులు
చిరుత దాడిలో పశువు మృతి
అధికారుల నిర్లక్ష్యంతో రైతుకు కష్టాలు
సమన్వయ లోపంతో నిలిచిన సాయం
కాకతీయ, చందుర్తి : చిరుతపులి దాడిలో పశువును కోల్పోయిన రైతుకు ఆరు నెలలు గడుస్తున్నా పరిహారం అందకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. నివేదికలు పూర్తయి, బాధిత రైతు అన్ని పత్రాలను సకాలంలో సమర్పించినప్పటికీ, నిధుల విడుదల జాప్యం కావడంతో రైతు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ప్రభుత్వం నుండి పరిహారం మంజూరుకు బడ్జెట్ నిధులు విడుదల కాకపోవడమే కారణమా లేక సంబంధిత శాఖల మధ్య సమన్వయ లోపం, అధికారుల నిర్లక్ష్యమే జాప్యానికి కారణమా అనే ప్రశ్నలు రైతులు, గ్రామస్తుల నుండి వ్యక్తమవుతున్నాయి. అడవి జంతువుల దాడుల వల్ల నష్టపోయిన వారికి తక్షణ సాయం అందిస్తామని ప్రభుత్వాలు పదేపదే ప్రకటిస్తున్నా, లింగంపేట రైతు విషయంలో నెలల తరబడి పరిహారం నిలిచిపోవడం ప్రభుత్వ హామీలపై సందేహాలకు దారితీస్తోంది. సంబంధిత అధికారులు జాప్యానికి గల అసలు కారణాలను వెల్లడించాలని, బాధితుడికి వెంటనే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ జిల్లా అధికారి స్పందించి, పెండింగ్‌లో ఉన్న పరిహారాన్ని మంజూరు చేయాలని కోరుతున్నారు.

