వచ్చే ఎన్నికల్లో కరీంనగర్‌లో కాంగ్రెస్‌దే విజయం
ఎస్ఐఆర్‌పై శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి
ఓట్లే కాదు.. సీట్ల చోరీకీ కేంద్రం పాల్పడుతోంది
కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కాకతీయ, కరీంనగర్ : రానున్న ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ నగరంలోని సీతారాంపూర్‌లో ఆదివారం నిర్వహించిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఎల్ఏ-2 (బూత్ లెవల్ ఏజెంట్-2) సభ్యుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ అనుకూల, లౌకికవాద ఓటర్లను లక్ష్యంగా చేసుకుని కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో కొనసాగుతున్నాయో లేదో ప్రతి నాయకుడు, కార్యకర్త పరిశీలించాలని సూచించారు. ఓట్ల చోరీకి అవకాశం లేకుండా కార్యకర్తలు సైనికుల్లా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. పీసీసీ ఉపాధ్యక్షుడు, మాస్టర్ ట్రైనర్ నమిండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు అత్యంత ప్రాధాన్యంతో తీసుకోవాలన్నారు. ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే ప్రక్రియలో బూత్ స్థాయి నాయకులు, ఏజెంట్లు పూర్తిస్థాయిలో పాల్గొని ప్రతి ఓటును రక్షించాలని సూచించారు. సంబంధం లేని కేసును ఆధారంగా చేసుకుని మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించడం దురదృష్టకరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఓట్ల చోరీ మాత్రమే కాకుండా సీట్ల చోరీకి కూడా పాల్పడుతోందని విమర్శించారు.
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఓటరు నమోదు, మార్పులు, చేర్పుల ప్రక్రియలో ప్రజలకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, అర్బన్ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వైద్యుల అంజన్ కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం తదితరులు ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
అనంతరం నమిండ్ల శ్రీనివాస్ బీఎల్ఏ-2 సభ్యులు, బూత్ లెవల్ ఏజెంట్లకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై శిక్షణ అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

