ఓటు హక్కు విలువైనది
ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటరు నమోదు కీలకం
ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్
బీఎల్‌ఏలకు ఎస్ఐఆర్‌పై కాంగ్రెస్ నేతలకు శిక్షణ
ఇంటింటికీ వెళ్లి అర్హులైన వారిని గుర్తించాలని సూచన
కాకతీయ, కారేపల్లి : వైరా నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై బీఎల్‌ఏలకు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, బీఎల్‌ఏలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ, ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు కల్పించడం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. బీఎల్‌ఏలు అత్యంత బాధ్యతతో ఇంటింటికీ వెళ్లి అర్హులైన ఓటర్ల వివరాలను సేకరించాలని, జాబితాలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సవరించే ప్రక్రియలో చురుకుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింగరేణి మండలానికి చెందిన తెలంగాణ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ, పీసీసీ అధికార ప్రతినిధి లోకేష్ యాదవ్ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ శిక్షణ ద్వారా బీఎల్‌ఏలకు ఓటరు నమోదు, మార్పులు, తొలగింపులు మరియు చిరునామా సవరణ వంటి అంశాలపై ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సమగ్ర అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

