విత్తన, ఎరువుల దుకాణాల్లో అధికారుల తనిఖీలు
కాకతీయ, చింతకాని : ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులను మోసం చేసే నకిలీ విత్తన మాఫియాపై నిఘా పెంచిన అధికారులు, చింతకానిలోని విత్తన, ఎరువుల దుకాణాల్లో ఉమ్మడిగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు వైరా సీఐ వెంకట ప్రసాద్, వ్యవసాయ శాఖ ఏడీ వాణీశ్రీ, ఏవో మానస, చింతకాని ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా పలు ఫర్టిలైజర్, సీడ్స్ షాపులను సందర్శించి విక్రయాల రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, లైసెన్సులు, బిల్లుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులకు విక్రయిస్తున్న విత్తనాలు, ఎరువులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? అనే అంశాలపై ఆరా తీశారు. ముఖ్యంగా విత్తన ప్యాకెట్లపై ఉన్న తయారీ తేదీలు, గడువు ముగింపు తేదీలు, కంపెనీ గుర్తింపు చిహ్నాలు మరియు ధరల వివరాలను అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

