బఫర్ జోన్లలో అనుమతులు ఇవ్వొద్దు
లేఔట్ అనుమతుల జారీలో నిబంధనలు పాటించాలి
దరఖాస్తులకు అప్రోచ్ రోడ్డు నిర్మాణం తప్పనిసరి
జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్
కాకతీయ, ఖమ్మం : లేఔట్ అనుమతుల జారీలో నిబంధనలను కట్టుదిట్టంగా పాటించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి జిల్లా స్థాయి లేఔట్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న 17 లేఔట్ దరఖాస్తులను కమిటీ పరిశీలించింది. ప్రతి దరఖాస్తుపై రెవెన్యూ, ఇరిగేషన్, ఇతర సంబంధిత శాఖల అధికారుల నుంచి అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు. లేఔట్ అనుమతులు మంజూరు చేసేటప్పుడు వాటర్ బాడీస్, ఎఫ్.టి.ఎల్. (ఫుల్ ట్యాంక్ లెవల్), బఫర్ జోన్ల పరిధిలోకి రాకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. లేఔట్లకు సంబంధించి అప్రోచ్ రోడ్డు తప్పనిసరిగా 18 మీటర్ల వెడల్పు ఉండాలని, దానికి అవసరమైన భూమి కేటాయింపులు జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. లేఔట్ ప్రాంతంలో గతంలో ఏవైనా నీటి వనరులు ఉన్నాయా లేదా అని సాంకేతికతను వినియోగించి క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.
పారదర్శకతకు ప్రాధాన్యం
లేఔట్ ఆమోద ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, నిబంధనలకు లోబడి మాత్రమే అనుమతులు జారీ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అనుమతులు జారీ చేసిన తర్వాత, అభివృద్ధి పనుల సమయంలో నిబంధనలను పాటిస్తున్నారో లేదో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్, మండల సర్వేయర్లు, ఆర్డీవోలు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రిపోర్టు అందించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ పారస్ కుమార్, ఎస్.డి.సి. సదానందం, ఇరిగేషన్ సీఈ ఎం. వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బీ ఎస్ఈ యాకోబు, పీఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, ఎన్.పి.డి.సి.ఎల్. ఎస్ఈ శ్రీనివాసా చారి, సుడా సీపీఓ రాజ్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

