డ్వాక్రా రుణాల్లో మాయాజాలం
ఏదులాపురం మున్సిపాలిటీలో స్తంభించిన రుణాలు
ఏడాది దాటినా అందని ఆర్థిక సాయం..
కార్యాలయాల చుట్టూ మహిళల ప్రదక్షిణలు
కోటీశ్వరులను చేస్తామన్న ప్రభుత్వ మాటలు నీటిమూటలేనా?
అప్పుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల ఆశ్రయం.
890 గ్రూపుల్లో సుమారు 89 వేల మందిపై ప్రభావం
డేటా ఎంట్రీ పేరుతో కాలయాపన చేస్తున్న అధికారులు
కాకతీయ, ఖమ్మం : ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం.. ఆర్థికంగా బలోపేతం చేస్తాం అంటూ వేదికలెక్కినప్పుడల్లా పాలకుల నుంచి వినిపించే ఊదరగొట్టే ప్రసంగాలు, క్షేత్రస్థాయికి వచ్చేసరికి నీటిమూటలవుతున్నాయి. ఖమ్మం రూరల్ మండలం నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన ‘ఏదులాపురం’లో డ్వాక్రా మహిళల పరిస్థితి చూస్తుంటే, ప్రభుత్వ హామీలకు, ఆచరణకు మధ్య ఉన్న అగాధం స్పష్టంగా కనిపిస్తోంది. మున్సిపాలిటీగా ఏర్పడి ఏడాది గడిచినా, వేలాది మంది మహిళలకు అందాల్సిన రుణాలు మాత్రం గాలిలోనే ఉన్నాయి. మహిళా సంఘాలకు అందే డ్వాక్రా, స్త్రీనిధి రుణాలు వారి పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు, చిన్నపాటి వ్యాపారాలకు భరోసానిస్తాయి. అయితే ఏదులాపురంలో గత కొన్ని నెలలుగా రుణాలు నిలిచిపోవడంతో మహిళలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. “నా బిడ్డ పెళ్లి కోసం అప్పు కోసం తిరగని కార్యాలయం లేదు, చివరకు బయట రూ. 2 వడ్డీకి తెచ్చి వివాహం చేశాను” అంటూ ఓ తల్లి కార్యాలయం ఎదుట అధికారుల ముందు వాపోయిన తీరు, అక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. ఆర్థికంగా ఎదగాల్సిన మహిళలు, రుణాల కోసం కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగడం దేనికీ సంకేతం?
890 గ్రూపులు.. 89 వేల మందిపై ప్రభావం
ఖమ్మం రూరల్ మండలంలో గతంలో 3 వేల గ్రూపులు ఉండగా, మున్సిపాలిటీగా మారిన తర్వాత ఏదులాపురంలో 890 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో పదిమంది సభ్యులు ఉన్నా, సుమారు 89 వేల మంది మహిళల జీవనోపాధి ఈ రుణాలు మంజూరు కావడంలోనే ఉంది. వీరికి సహకరించాల్సిన గ్రామ దీపికలు ఉన్నా, లోన్ల ప్రక్రియ మాత్రం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అధికారంలోకి రాగానే మరుగున పడిపోవడం పట్ల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల ‘డేటా’ సాకు.. మౌనంగానే సర్దుకుపోవాలా?
రుణాల జాప్యంపై అధికారులను వివరణ కోరితే, “గ్రామాలను మున్సిపాలిటీ వార్డులుగా మార్చినందున డేటా ఎంట్రీలో ఆలస్యం జరిగింది” అని డీసీఎం సుజాత సమాధానమిస్తున్నారు. మున్సిపాలిటీగా మారి ఏడాది గడిచినా, డేటా ఎంట్రీ సమస్యతో రుణాలను ఆపేయడం ఎంతవరకు సమంజసమని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ప్రక్రియ పూర్తయ్యిందని అధికారులు చెబుతున్నా, రుణాలు మాత్రం ఇప్పటికీ మహిళల ఖాతాల్లోకి చేరడం లేదు. పాలకుల మాటలకు, అధికారుల ఆచరణకు పొంతన లేకపోవడంతో మహిళలు గందరగోళానికి గురవుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, ఏదులాపురంలోని మహిళా సంఘాలకు తక్షణమే రుణాలు విడుదల చేయాలని, లేనిపక్షంలో కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మహిళా ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ‘కోటీశ్వరుల’ హామీ కేవలం ఎన్నికల వరకు మాత్రమేనా? లేక నిరంతర ప్రక్రియనా? అనేది అధికారులు తేల్చాల్సి ఉంది.

