పైనకళాశాల.. కింద గ్యాస్ గోడౌన్
ఎరువుల షాపు, గ్యాస్ ఏజెన్సీ, కళాశాల ఒకే కాంప్లెక్స్‌లో
ప్రమాదం గుప్పిట్లో 150 మంది విద్యార్థుల ప్రాణాలు
ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?
అధికారుల మౌనం.. అంతుచిక్కని మతలబు!
విచారణ చేసి చర్యలు తీసుకుంటాం : సివిల్ సప్లై డీటీ రాములు
కాకతీయ, దుమ్ముగూడెం : నిబంధనలు సామాన్యులకేనా? అనే ప్రశ్నలకు నిదర్శనంగా దుమ్ముగూడెం మండలంలోని మలకపాడులో జరుగుతున్న వ్యవహారం నిలుస్తోంది. ఒకే భవనంలో గ్యాస్ గోడౌన్, ఎరువుల దుకాణం, కళాశాలను ఏర్పాటు చేసి, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై స్థానికులు మండిపడుతున్నారు. మలకపాడు ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఒకే కాంప్లెక్స్‌లో ఒకవైపు సఖి సెంటర్ ద్వారా గ్యాస్ సరఫరా చేస్తున్నారు. అదే కాంప్లెక్స్‌లో సృజన ఆగ్రో వారి ఎరువుల దుకాణం ఉంది. ఇక అదే భవనం మొదటి అంతస్తులో టెక్నో వోకేషనల్ జూనియర్ కళాశాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ 150 మందికి పైగా విద్యార్థులు నిత్యం విద్యనభ్యసిస్తున్నారు. కింద ప్రమాదకరమైన గ్యాస్ సిలిండర్లు, రసాయన ఎరువులు ఉంటే, పైన విద్యార్థులు పాఠాలు వింటున్నారు. అగ్ని ప్రమాదం వంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే పరిస్థితి ఏంటో ఊహించుకోవడానికే భయంగా ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల మౌనం.. అంతుచిక్కని మతలబు!
సామాన్యుడు చిన్నపాటి నిర్మాణం చేపట్టినా, దరఖాస్తుల పేరుతో నెలల తరబడి తిప్పించుకునే అధికారులు, ఇంతటి భారీ ప్రమాదాన్ని కళ్లముందే చూస్తున్నా ఎందుకు స్పందించడం లేదనేది ఇప్పుడు స్థానికుల మధ్య చర్చనీయాంశమైంది. ప్రతిరోజూ అధికార యంత్రాంగం ఆ భవనం పక్క నుంచే వెళ్తున్నా, చట్ట ఉల్లంఘన వారికి ఎందుకు కనిపించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారుల మౌనం వెనుక ఉన్న ‘మాయ’ ఏమిటో బయటపడాలని డిమాండ్ చేస్తున్నారు.
వందల మంది విద్యార్థుల భవిత ఉన్న కళాశాల కింద గ్యాస్ గోడౌన్‌కు అనుమతులు ఇచ్చింది ఎవరు?
ప్రమాదం జరిగితే బాధ్యత వహించేది ఎవరు? ఒకే చోట ఎరువులు, గ్యాస్ నిల్వ చేయడం ఎంతవరకు సమంజసం? అంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా, నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని దుమ్ముగూడెం ప్రజలు కోరుతున్నారు. ప్రమాదం జరిగాక చర్యలు తీసుకోవడం కంటే, ముందస్తుగా అడ్డుకోవడమే సరైన బాధ్యత అని స్థానికులు గుర్తు చేస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం: రాములు, సివిల్ సప్లై డీటీ
నిబంధనకు విరుద్ధంగా నిర్వహిస్తున్న గ్యాస్ గోడౌన్ షాపులో కళాశాల నిర్వహణపై సివిల్ సప్లై డిటి రాములును ఈ విషయంపై కాకతీయ ప్రతినిధి వివరణ కోరగా స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఈ రెండు రోజుల్లో వస్తానని తెలిపారు.

