మైరాడాను మోసం చేస్తున్న ఉద్యోగులు
కొత్తపల్లి చెరువు పూడికతీతలో లీలలు బహిర్గతం
ఫామ్ ఫండ్ పనుల పేరిట రైతుల నుంచి వసూళ్లు
స్వచ్ఛంద సంస్థ లక్ష్యాలకు గండికొడుతున్న క్షేత్రస్థాయి సిబ్బంది
ఐదేళ్లుగా ఒకే కాంట్రాక్టర్.. బైఫ్లో చేసిన వారే..మైరాడాలోనూ వారే
కాకతీయ, దుమ్ముగూడెం : రైతుల ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టడమే లక్ష్యంగా పనిచేస్తోంది మైరాడా స్వచ్ఛంద సంస్థ. అయితే, సంస్థ నిర్దేశించుకున్న గొప్ప లక్ష్యాలను పక్కనపెట్టి, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది, కాంట్రాక్టర్లు స్వార్థానికి తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిస్వార్థంగా సేవలందించే సంస్థ ఆశయాలకు గండికొడుతూ, అక్రమార్కులు తమ జేబులు నింపుకుంటున్న వైనం ఇప్పుడు దుమ్ముగూడెం మండలంలో చర్చనీయాంశంగా మారింది. మైరాడా సంస్థ ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్న నమ్మకంతో పనులను చేపడితే, ఇక్కడే అక్రమార్కుల కథ మొదలవుతోంది. క్షేత్రస్థాయిలో పనిచేసే కొందరు సిబ్బంది, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై, అమాయక రైతులతో గ్రూపులు కట్టించి వారిని మభ్యపెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సంస్థ ఉద్దేశం రైతులకు లబ్ధి చేకూర్చడం అయితే, వీరు మాత్రం రైతులకు వచ్చే ప్రయోజనంలో పావు వంతు మాత్రమే అందించి, మిగిలిన ముప్పావు వంతు సొమ్మును కాంట్రాక్టర్ల జేబుల్లోకి మళ్లిస్తున్నారనేది బహిరంగ రహస్యం. ముఖ్యంగా కొత్తపల్లి, నారాయణరావు పేట పంచాయతీలలో చేపట్టిన చెరువు పూడికతీత, ఫామ్ ఫండ్ పనుల్లో జరిగిన అక్రమాలే దీనికి నిదర్శనమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అన్నీ తెలిసినా.. మౌనం ఎందుకు..!
ఒక్కో ఫామ్ ఫండ్ పని కోసం రైతుల వద్ద నుంచి 3 నుంచి 5 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. ఈ విషయంపై ఫిర్యాదులు అందినా వారిపై చర్యలు తీసుకునే వారు కరువయ్యారంటూ చర్చ జరుగుతోంది. ఐటీసీ ఎమ్మెస్కేలో పనిచేసే ఒక టెక్నికల్ అసిస్టెంట్ సహకారంతోనే ఈ తంతు అంతా నడుస్తోందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. గతంలో ‘బైఫ్’ స్వచ్ఛంద సంస్థలో పనిచేసిన వ్యక్తులే, మైరాడాలోకి చేరి అదే పాత పద్ధతుల్లో దందాను కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. 2015-2020 కాలంలో వారికి ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకుని, ఇప్పుడు ఒకరు కాంట్రాక్టర్‌గా, మరొకరు పీసీగా మారి అందినకాడికి దండుకుంటున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.
సంస్థ ప్రతిష్ఠను కాపాడాలి
సంస్థ పేరును అడ్డుపెట్టుకుని, రైతుల కష్టాన్ని దోచుకుంటున్న ఈ సిబ్బంది తీరుతో మైరాడా ప్రతిష్ఠకు మచ్చ కలుగుతోంది. సంస్థ యొక్క సేవా దృక్పథానికి ఎటువంటి అపవాదులు రాకుండా ఉండాలంటే, అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బందిపై, కాంట్రాక్టర్లపై ఐటీసీ మరియు మైరాడా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ అవినీతిపై పూర్తిస్థాయి విచారణ చేపడితేనే, నిజమైన లబ్ధిదారులైన రైతులకు న్యాయం జరుగుతుందని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

