షెడ్డు తాళాలు పగులగొట్టి జీవాల అపహరణ
రూ.3.17 లక్షల విలువైన గొర్రెలను ఎత్తుకెళ్లిన దుండగులు
ఆచూకీ కోసం గాలిస్తున్న గీసుగొండ పోలీసులు
కాకతీయ, గీసుగొండ : అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు రేకుల షెడ్డు తలుపులు తెరిచి 25 గొర్రె పొట్టేళ్లు, ఒక మేకను చోరీ చేసిన ఘోర ఘటన గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. గీసుగొండ సీఐ డీ.విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం… వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) 16వ డివిజన్ ధర్మారం గ్రామానికి చెందిన గొర్రెల వ్యాపారి రాజబోయిన రవి తన ఇంటి సమీపంలోని ఎస్‌ఆర్ మోడల్ స్కూల్ పక్కన ఉన్న చీరాల ఉమారెడ్డి భూమిని లీజుకు తీసుకున్నాడు. అక్కడ రేకుల షెడ్ నిర్మించి సుమారు 200 గొర్రెలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఉదయం వెళ్లి చూసేసరికి షెడ్డు తలుపులు ఓపెన్!
ఆదివారం సాయంత్రం గొర్రెలను మేపుకుని వచ్చి షెడ్డులో ఉంచిన రవి.. రాత్రి 11:30 గంటల వరకు అక్కడే కాపలా ఉన్నాడు. అనంతరం షెడ్ తడకల ద్వారాన్ని ఇనుప వైర్లతో పటిష్టంగా బిగించి నిద్రించడానికి ఇంటికి వెళ్లాడు. మళ్లీ సోమవారం ఉదయం 5 గంటల సమయంలో షెడ్ వద్దకు వెళ్లి చూడగా తడకల ద్వారం తెరిచి ఉండటాన్ని గమనించి షాక్‌కు గురయ్యాడు. లోపలికి వెళ్లి పరిశీలించగా 25 పెద్ద గొర్రె పొట్టేళ్లు, ఒక మేక కనిపించకుండా పోయాయి. అపహరణకు గురైన జీవాల మొత్తం విలువ సుమారు రూ.3,17,500 ఉంటుందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా గొర్రెల ఆచూకీ లభించకపోవడంతో బాధితుడు గీసుగొండ పోలీసులను ఆశ్రయించాడు. రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ డీ. విశ్వేశ్వర్ తెలిపారు. క్లూస్ టీమ్ సాయంతో దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు.

