కేటీఆర్‌కు ఇంకా జ్ఞానోదయం కాలేదు
ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మారలేదు
కాంగ్రెస్‌ను దూషించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ సమ్మేళనాలు
ఫామ్‌హౌస్ రైడ్‌పై ఎమ్మెల్సీ పోచంపల్లి జవాబు చెప్పాలి
టెక్స్టైల్ పార్క్ బిల్లులు ఎగ్గొట్టిన చరిత్ర గులాబీ పార్టీది
కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిపై మాట్లాడే కనీస అర్హత లేదు
పరకాలలో రౌడీయిజానికి తావు లేదు : ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
కాకతీయ, పరకాల : గత శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చి ఓడించినప్పటికీ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఇంకా బుద్ధి రాలేదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం పరకాల నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి, కేవలం కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వ నాయకులను దూషించడానికే బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు.
తప్పులు కప్పిపుచ్చుకునేందుకే తిట్ల పురాణం
బీఆర్ఎస్ నాయకుల తిట్ల పురాణం, అబద్ధాల ప్రచారం అంతా వారి పదేళ్ల పాలనలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికేనని రేవూరి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను, రైతులను ఘోరంగా మోసం చేసిందని, మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అప్పులను చెల్లిస్తూనే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గాడిలో పెడుతోందన్నారు. బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోవాలంటే ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాలని సూచించారు.
ఫామ్‌హౌస్ రైడ్‌పై సమాధానం చెప్పాలి
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేసే ముందు, ఇటీవల ఫామ్‌హౌస్ రైడ్‌పై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన వివరణ ఇవ్వాలన్నారు. అలాగే, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో టెక్స్టైల్ పార్క్ పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించకుండా ఎగ్గొట్టారని, తాను ఎమ్మెల్యే అయ్యాక ప్రత్యేక చొరవ తీసుకుని బిల్లులు ఇప్పించి పనులను వేగవంతం చేశానని స్పష్టం చేశారు.
పరకాలలో రౌడీయిజానికి స్థానం లేదు
తాను డబ్బులతో కాకుండా ప్రజల నమ్మకంతో గెలిచానని రేవూరి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. పరకాల నియోజకవర్గంలో రౌడీయిజానికి, బెదిరింపుల రాజకీయాలకు తావు లేదని హెచ్చరించారు. ప్రజలు ప్రశాంతంగా జీవించే వాతావరణాన్ని కల్పించడమే తన నిబద్ధత అని, ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని ఆయన స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

