ల్యాదెల్ల రాజుది సహజ మరణమే
పరకాల ఏసీపీ సీహెచ్ సతీష్ బాబు
సడన్ కార్డియాక్ అరెస్ట్ వల్లే మృతి చెందినట్లు మెడికల్ రిపోర్ట్
నేరపూరిత చర్యలు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవు
అనుమానాస్పద మృతి కేసుపై ముగిసిన సమగ్ర శాస్త్రీయ దర్యాప్తు
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ప్రత్యేక దర్యాప్తు అధికారి
కాకతీయ, గీసుగొండ : గొర్రెకుంట గ్రామానికి చెందిన ల్యాదెల్ల రాజు అలియాస్ లవ్ రాజు మృతి కేసులో సమగ్ర దర్యాప్తు అనంతరం అది సహజ మరణమేనని తేలినట్లు ప్రత్యేక దర్యాప్తు అధికారి, పరకాల ఏసీపీ సీహెచ్ సతీష్ బాబు స్పష్టం చేశారు. మంగళవారం గీసుగొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసు దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. గత ఏడాది అక్టోబర్ 19న ల్యాదెల్ల రాజు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందగా.. గీసుగొండ పోలీస్ స్టేషన్లో క్రైం నంబర్ 337/2025 కింద కేసు నమోదైంది. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు.. ఈ కేసు లోతుపాతులను వెలికితీసేందుకు పరకాల డివిజన్ ఏసీపీని ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమించి అన్ని కోణాల్లో విచారణ జరిపినట్లు ఆయన పేర్కొన్నారు.
శాస్త్రీయ ఆధారాలతో విచారణ
దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థల పరిశీలన, పంచనామా, పోస్టుమార్టం నిర్వహించడంతో పాటు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ నిపుణుల సేవలను వినియోగించుకున్నట్లు ఏసీపీ తెలిపారు. వీటితో పాటు పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా రికార్డులు, వాట్సాప్ చాట్స్ మరియు అనుమానితుల విచారణ తదితర అన్ని సాంకేతిక కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. మృతుడి కుటుంబ సభ్యులు వ్యక్తం చేసిన ప్రతి అనుమానంపైనా ప్రత్యేకంగా విచారణ జరిపామన్నారు.
బాహ్య గాయాలు లేవు.. గుండెపోటే కారణం
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికలు, హిస్టోపాథాలజీ పరీక్షలు, కాకతీయ మెడికల్ కాలేజ్ ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం వైద్య నిపుణుల తుది అభిప్రాయాల ప్రకారం.. మృతదేహంపై ఎటువంటి ప్రాణాంతక బాహ్య లేదా అంతర్గత గాయాలు లేవని నిర్ధారణ అయిందని ఏసీపీ వివరించారు. శరీరంలో ఎలాంటి విషపదార్థాల ఆనవాళ్లు కూడా లభించలేదన్నారు. మృతదేహంపై గమనించిన కొన్ని గుర్తులు మరణానంతర మార్పులు, చీమల కాట్లు మరియు తుమ్మ చెట్టు ముళ్ల కారణంగా ఏర్పడినవేనని వైద్య నిపుణులు స్పష్టం చేశారన్నారు. చివరగా హిస్టోపాథాలజీ నివేదికల ఆధారంగా ల్యాదెల్ల రాజు ‘సడన్ కార్డియాక్ అరెస్ట్’ (తీవ్ర గుండెపోటు) కారణంగానే మరణించినట్లు వైద్య నిపుణులు తుది నివేదిక ఇచ్చారని చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి హత్య లేదా ఇతర నేరపూరిత చర్యలు జరిగినట్లు ఎటువంటి సాక్ష్యాలు లభించకపోవడంతో దీనిని సహజ మరణంగా నిర్ధారించి కేసును ముగించినట్లు ప్రత్యేక దర్యాప్తు అధికారి సీహెచ్ సతీష్ బాబు ప్రకటించారు. ఈ సమావేశంలో మామునూరు ఏసీపీ వెంకటేష్, తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, గీసుగొండ సీఐ డీ. విశ్వేశ్వర్, ఎస్సైలు కుమార్, అనిల్ కుమార్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

