నిజం రాయడం నేరమా?
అక్రమాలను ప్రశ్నిస్తే అసత్య ప్రచారాలా?
స్పష్టత కోసం రిపోర్టర్ ఫోన్ చేస్తే రాజీ కోసం వచ్చినట్లా..?
ఆధారాలు ఉంటే బయటపెట్టు.. చట్టపరంగా ఎదుర్కో!
వ్యక్తిగత కక్ష కాదు.. మా పోరాటం వ్యవస్థా వ్యతిరేకతపైనే!
అసత్య ప్రచారాలు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు
ఉత్తరం కాకతీయపై తప్పుడు ప్రచారంచేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
శ్రీకర్ బెదిరింపులు లొంగబోయేది లేదని స్పష్టం చేస్తున్నాం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : నిజం నిప్పులాంటిది.. అది ఎవరికైనా తగలక మానదు. మణుగూరులో ఇసుక ర్యాంపుల ముసుగులో జరుగుతున్న అక్రమాలపై ఉత్తరం కాకతీయ పత్రిక రాస్తున్న వరుస కథనాలు, ఇప్పుడు ఇసుక కాంట్రాక్టర్ శ్రీకర్‌కు మింగుడుపడటం లేదు. వాస్తవాలను రాస్తున్నందుకు, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకు కాకతీయపై అసత్య ప్రచారాలకు తెరలేపడం శ్రీకర్ అసమర్థతకు పరాకాష్ట. ఉన్నది ఉన్నట్లుగా రాస్తే ఉలిక్కిపడుతున్న శ్రీకర్, ఆ భయంలోనే పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు. అసలు క్వశ్చన్ పేపర్ శ్రీకర్ చేతిలోనే ఉంటే, సమాధానం చెప్పలేక ఇతరులను ఎందుకు నిందిస్తున్నారు?
ఫోన్ కాల్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి?
స్పష్టత కోసం మా రిపోర్టర్ ర్యాంపుల్లో భాగస్వామిగా ఉన్న ఓ కాంట్రాక్టర్‌కు ఫోన్ చేస్తే.. దాన్ని రాజీ కోసం వచ్చినట్లుగా చిత్రించే ప్రయత్నం చేయడం శ్రీకర్ దిగజారుడుతనానికి నిదర్శనం. అలాంటప్పుడు, నీ తరఫున మాకు ఫోన్లు చేయించిన వాళ్లను ఏమనాలి? వారు దేని కోసం ఫోన్ చేశారు? శ్రీకర్ తన అక్రమాలను దాచుకోవడానికి చేస్తున్న ప్రతి ప్రయత్నం, ఒక బురద చల్లుకునే ప్రయత్నమేనని ప్రజలకు అర్థమవుతోంది. శనివారం ఉదయం నుంచి ఉత్తరం కాకతీయ శ్రీకర్‌ను డబ్బులు డిమాండ్ చేసినట్లుగా శ్రీకర్ పేరుతో కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజులు పెట్టించడం ఆయన స్థితికి నిదర్శనం. శ్రీకర్ మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే బయటపెట్టండి. లేదంటే పరువునష్టం దావా వేయ్.. చట్టపరమైన చర్యలు తీసుకో. అది వదిలేసి, అసత్య ప్రచారాలు చేసి బెదిరించాలని చూస్తే, ఉత్తరం కాకతీయ పత్రిక ఏనాడూ భయపడదు.
మా పోరాటం వ్యక్తిగతం కాదు.. వ్యవస్థాత్మకం!
మాకు శ్రీకర్‌పై ఏ వ్యక్తిగత కక్ష లేదు. ర్యాంపుల వ్యవహారంలో నీ పాత్ర ఏంటో, ఏ స్థాయి అక్రమాలు జరుగుతున్నాయో మాత్రమే మేము రాస్తున్నాం. గిరిజనుల ఉపాధిని దెబ్బకొట్టే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు, కనీసం మా కథనాల్లో ఆ ప్రస్తావన కూడా లేదు. అసలు గిరిజనుల పొట్ట కొడుతున్నది, వారి పేరుతో కోట్లు గడిస్తున్నది ఎవరు? ఈ విషయం మణుగూరులోని ప్రతి ఒక్కరికీ తెలుసు. మా పోరాటం అంతా ర్యాంపుల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలు, నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఇసుక రవాణాపైనే. లారీ యజమానుల నుంచి జరుగుతున్న అక్రమ వసూళ్లపైనే మా అక్షర ఆయుధాలు. ఈ అక్రమాలకు సహకరిస్తున్న యంత్రాంగం, వారిని వెనకుండి నడిపిస్తున్న రాజకీయ నేతలపైనే మా వరుస కథనాలు. అక్రమాలను ఎండగట్టడం ఒక పత్రికగా మా బాధ్యత. అందుకే కొద్ది రోజులుగా వరుస కథనాలు రాస్తున్నాం. ఈ కథనాలకు స్థానికంగా ఉన్న ఎంతో విద్యావంతులు, గిరిజన యువత, సామాజిక స్పృహ ఉన్న వారి నుంచి ఇన్పుట్కూడా అందుతోంది. అందుకే రాయగలుగుతున్నాం. రాస్తాం కూడా. ఈ వాస్తవాలను పక్కన పెట్టి, ప్రజల దృష్టిని మళ్లించడానికి, విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టించడానికి శ్రీకర్ చేస్తున్న ప్రతి ప్రయత్నం విఫలయత్నమే. శ్రీకర్.. అబద్ధాలను వంద సార్లు చెబితే నిజం కావు. ఆధారాలు లేకుండా కాకతీయపై ఆరోపణలు చేస్తే, మీకే నష్టం తప్ప మాకేం లేదు. ఇప్పటికైనా అక్రమ దందాను ఆపి, చట్టబద్ధంగా నడుచుకోవడం నేర్చుకోండి. అక్రమాలపై వార్తలు రాస్తే బెదిరిస్తే మాకు చట్టం,న్యాయపరమైన చర్యలు తీసుకునే విధానం తెలుసు. ఈ అసత్య ప్రచారాలు, బెదిరింపులు మా ముందు ఏమాత్రం చెల్లవు.

